పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపా: ఇ-ఇ-ఇ-ఇవన్నీ ఏ-ఏమిటి?

ఆ ఉపాధ్యాయుడు అన్నీ చూచాడు. ఇవి పరుగుపందేలవి; ఇవి ఒక మైలు పందెంవి; ఇవి అరమైలు పందెంవి; ఇది నాలుగు వందల గజాలు; ఇది వంద గజాలువి; ఇవి కాలిబంతి తన్నినందుకు. ఇవి కాలిబంతి ఆటకు; అంటూ. అవన్నీ తెల్లబోతూ చూచాడు; అతని కళ్ళు చెదరిపోయాయి. ఆ ఉపాధ్యాయుని హృదయంలో ఉడుకుబోతుతనం కూడా వచ్చింది.

అయినా ఏదో మహానిధిని తాను కనిపెట్టినట్లు ఉప్పొంగిపోయాడు. ఈ మాదిగ కుర్రవానికి ఇవన్నీ రావడం ఏమిటి? ఇవన్నీ తనకే వచ్చి ఉండాలి అని భావించుకొన్నాడు. ఈ రహస్యం ఎవరికీ చెప్పకుండా తాను గమ్మత్తు చేయాలనుకున్నాడు.

ఇంకో వారం రోజులలో పుట్‌బాల్ పందెం ఒకటి ఉంది. కాలేజిలో "ఏ" జట్టువారికీ “బి” జట్టు వారికీ ఆ పందెం. చూచి చూచి ఆటల ఉపాధ్యాయుడు ఎల్లమందను “ఏ” జట్టులో వేయలేకపోయాడు. అతణ్ణి “బి” జట్టు పేరులలో చేర్చినట్లున్ను ఎవరికీ తెలియ చేయలేదు. అమలాపురం హైస్కూలు నుంచి వచ్చిన ఒక బాలకుణ్ణి “ఏ" జట్టులో ఎడమ ఫార్వర్డుగా వేసినాడు.

రెండు జట్టులలో ఉన్నవారు చాలమంది - నిరుటి వారే అయినా కొంతమంది కొత్త వారున్నారు. ఇతర కాలేజీలలోంచి వచ్చి. బి.ఏ.లో, బి.ఎస్.సి.లో చేరిన బాలురను కొంతమందిని రెండు జట్టులలో చేర్చినాడు. వారున్నూ ఇదివరకున్న వారున్నూ రోజూ కాలిబంతి ఆట ఆడుతూ ఉండటం చేత ఒకరి కొకరికి బాగా ఎరుక అయింది. స్నేహాలు కుదిరినాయి.

కాని ఎల్లమంద ఆడతాడని ఎవరికీ తెలియదు. అతనికి అన్ని బహుమానాలు వచ్చాయనిగాని, మంచి పరుగు పందెం వాడనిగాని ఎవ్వరికీ తెలియదు.

వారం రోజులు గడచినవి. ఆటరోజు వచ్చింది. ఆఖరి క్షణంలో ఎల్లమందకు జూనియర్ జట్టువేషం వేసి, ఆ ఆటల ఉపాధ్యాయుడు తీసుకువచ్చి శ్రేణిలో నిలుచుండబెట్టాడు.

“ఇదేమిటి ఈ జంతువును తీసుకువచ్చాడు? ఈ పక్షీంద్రుడు వచ్చాడేమిటి? ఈ మగ గేదిగారు రంగస్థలంలోకి దిగాడేమిటిరా?”

“మన మాష్టారుగారికి మతిపోయింది. రోయి!” ఈలా ఈలా గుసగుసలు ఇకిలింపులు.

ఆట ప్రారంభం అయింది. ఎల్లమందకు బంతిని అందివ్వ లేదు తక్కిన ఆటగాళ్ళు. తక్కిన నలుగురు ఫార్వర్డులే ఒకరికొకరు అందించుకోవడమూ, వారే బంతి తీసుకువెళ్ళడం, సీనియర్ జట్టు వాళ్ళలో హాఫ్‌కాక్‌లు నిముషంలో వారి దగ్గిరనుండి బంతి తప్పించడం, తమ ఫార్వర్థులకు అందివ్వడం అది వారు గద్దలులా ఎగతన్నుకుపోవడం, అక్కడ జూనియర్ జట్టువారి బాక్‌లు హాఫ్‌కాక్‌లు ఆ బంతిని వెనక్కు నెట్టివెయ్యాలని విశ్వప్రయత్నం చేయడం, వారికి జూనియర్ జట్టు ఫార్వర్డులు కూడా వెనక్కుపోయి సహాయం చేయడం, చావు తప్పి కన్ను లొట్టపోయి ఎల్లాగయితేనేం బంతిని వెనక్కు నెట్టడం ఈలా జరుగుతోంది నాటకం.


అడివి బాపిరాజు రచనలు - 7

9

నరుడు(సాంఘిక నవల)