పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(తృతీయగుచ్చము)

ఏమిటీ సంగీతం. ఎందుకూ ఈ సంగీతం అని పద్మావతి అనుకొన్నది. ఎవరైనా మధురంగా పాట ఒకటి పాడుతుంటే విన్న వారికి మైమరపు కలగాలి! ఏ రాగాలాపనలోనో, కంఠంలో ఏ గమకము వికసింపజేయటంలోనో, ప్రాణాలు కరిగిపోయి దొనదొన ఆనందరూపమై బాష్పాలు ప్రవహించి వస్తాయి అనుకుంటూ ఆమె రాగం ప్రస్తారము చేస్తూనే వుంది. ఆమె తన కంఠం పూర్ణంగా వికసితంచేసి మూడు స్థాయిలలో పాడుకుంటూ తన గాన సౌందర్యానికి తానే మైమరచిపోయేది. ఆమెకు లోకమంతా సంగీతమయమా అని ప్రశ్న ఉదయించేది. చప్పుడు చేయవు అని అనుకొనే కదలికలలో కూడా ఏవో అస్పష్టరాగాలు ధ్వనిస్తూనే ఉంటవి. నిట్టూర్పులో పున్నాగవరాళి ఉన్నదా? సాయంకాలపు మలయమారుతంలో మలయమారుతమే వున్నది.

సంగీతంతో సాహచర్యంవల్ల, గాంధర్వ పీఠాన్ని ఆర్జించడంవల్ల పద్మావతికి పగటికలలు ఎక్కువ కాసాగాయి. వాస్తవిక ప్రపంచముకన్న భావనాలోకం ఆమెకు ఎక్కువ నిజం కాసాగినది. వాస్తవిక ప్రపంచంలో అన్నీ అపశ్రుతులే. ఒక అపశ్రుతిని శ్రుతిగా దిద్దుకొనేటప్పటికి ఇంకొక కొత్త అపశ్రుతి దాపరిస్తుంది. జీవితం నిత్య శోభనమయం చేసుకోవాలంటే నిత్య జాగరూకత అవసరంకదా?

పద్మావతికి పెళ్ళినాటి భర్త వేరు. ఈనాటి భర్త వేరు. ఆనాడు తాను పద్దాలు. తన భర్త బుచ్చి వెంకులు. ఇద్దరూ కలిసి తిరుపతి కొండ మెట్లు ఎక్కుతూవుంటే ఆమెకు తాను ఒక పర్వతం ముందర ఎక్కినట్లయిపోయింది. తన భర్తను ఇంకా చేపల వాసన పొదివి కొన్నట్లే వున్నది.

నిద్రపోతూ గురక కొడతాడు. అతనికి లలితంగా ప్రణయ వాక్యాలు పలకటం చేతకాదు. లాలించలేదు. అనునయించలేడు.

నిజమే! డబ్బు గడిస్తూన్నాడు. ఏ సిల్కు ఆర్జుపాలెస్‌లోనో, ఏ భాలుసామి అయ్యర్ షాపులోనో చక్కని బెంగుళూరు చీరలు, బెనారస్ పట్టుచీరలు, ఖద్దరు సిల్కు అద్దకం చీరలు, వెంకటగిరి ఒరయారు, కోయంబత్తూరు, పుల్లపాడు నూలు నేత చీరలు బుచ్చి వెంకట్రావు కొనుక్కువచ్చి భార్యకు బహుమతులు ఇస్తూ వుండేవాడు. సెకండుహ్యాండ్ హిల్‌మన్‌మింక్స్ కారు కొన్నాడు. భార్యను సినిమాలకు తీసుకొని వెళ్ళేవాడు. బీచికి వాహ్యాళికి తీసుకువెళ్ళి భార్యతో పాటు సముద్రపు వొడ్డున కూర్చునేవాడు.

ఆమెలో అసంతృప్తి, తొలకరివర్షం చినుకులు భూదేవి హృదయంలోకి ప్రసరించి వచ్చినట్లు ప్రవేశించింది. ఈ జీవితంలో తనకేమి లోటున్నది? భర్త తనకున్న కోరికలనన్నిటిని నెరవేరుస్తున్నాడాయెను. బాగా సంపాదిస్తున్నాడు. బాగా ఖర్చు చేస్తున్నాడు. తన జీవితం యేదో ఓ వున్నత పథాలకు యెక్కి వెళ్ళేందుకు అతడు మెట్లు నిర్మిస్తున్నాడు, కాని డాక్టరు మూలం కనుక్కోలేని రోగికి కారణం తెలియలేని చిన్న రోగంలా, ఆమె జీవితంలో అసంతృప్తి ప్రవేశించింది. మృగశిరా కార్తి రాగానే ఆకాశంలో చిన్న చిన్న

అడివి బాపిరాజు రచనలు - 7

107

జాజిమల్లి(సాంఘిక నవల)