పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ఎల్లమంద రాజమండ్రి కాలేజీలో చేరిన అయిదు నెలల వరకు, ఒకరితో మాట్లాడలేదు. తన చదువేదో, తన కాలేజీ ఏదో! అతనికి అసలు ఉండడానికి స్థలం ఏది అన్న సమస్య ఆ బాలునికీ వచ్చింది. ఆ బాలుని చేర్పించడానికి వచ్చిన ఒక కాంగ్రెసు పెద్దకూ వచ్చింది.

ఉండేందుకు గది, భోజనానికి వసతి, ఈ రెండూ పెద్ద సమస్యలయినవి. డబ్బుకు చూడకుండా ఆ బాలకుణ్ణి హాస్టలులో ప్రవేశపెట్టినాడా పెద్ద మనుష్యుడు.

హాస్టలులో ఈ బాలునికి ఒక విడి గది ఏర్పాటు చేశారు. హాస్టలులో విడిగదులూ ఉన్నాయి, ఇద్దరు ముగ్గురు ఉండే గదులూ ఉన్నాయి.

ఎల్లమందకు తానొక్కడే ప్రపంచంలో ఒంటిగా ఉన్నట్లనిపించింది. బ్రాహ్మణ బాలురు, బ్రాహ్మణేతర బాలురు, క్రైస్తవ బాలురు అందరూ ఈతణ్ణి ఒంటిగా వదిలినారు. అతడు అందుకు తగినట్లు ఒంటరితనమే అలవాటు చేసుకున్నాడు.

కాని అతని ఒంటరితనానికి భంగం ఇంటరులో చేరిన ఆరు నెలలకు వచ్చింది. భీమవరం హైస్కూలులో ఎల్లమంద ఫుట్‌బాల్ ఆటలో గండరగండడు. అతడు ఎడమవైపు ఫార్వర్డు. ఎడమ కాలితో అతడు తన్నితే బంతి ఒక టన్ను బాంబులా వచ్చి గోలులోనో, గోలు దగ్గరో పడుతుంది. కండ పుష్టీ, బలంగల బాలుడవడం చేత ఏమీ అలసట లేకుండా ఎన్ని గంటలయినా సునాయాసంగా పరుగెత్తుతాడు. 'పరుగు పందెంలోనూ, ఎల్లమంద పిట్టపిడుగు. ఎల్లమందకు కాలిబంతి తన్నడంలోనూ, పరుగు పందేలలోను, కాలిబంతి ఆటలలోనూ రెండు డజన్లపైగా బహుమతులు వచ్చాయి. కప్పులు, షీల్డులు, మెడల్సు, అతని దేవదారు చెక్క పెట్టెనిండా ఉన్నాయి.

ఎల్లమంద వాటిని పూజిస్తాడు. ఎందుకంటే వాటివల్లనే ఇతర బాలురు తన దగ్గిర మూగుతారు. తన్ను గౌరవం చేస్తారు. కాలేజీ ఆటల ఉపాధ్యాయుడు, ఎల్లమందను ఏమి ఆటలలోనూ పాల్గొనటం లేదేమని అడిగినాడు. ఆ ఉపాధ్యాయుడు ఆరు నెలల వరకూ ఎల్లమందను ఆ ప్రశ్నే వేయకపోవడానికి కారణం అతడు మాదిగ కులస్థుడని తెలవడమే!

అయినా తన విద్యుక్తధర్మం కాబట్టి ఆరు నెలలకన్నా అడక్క తప్పింది కాదు. అదయినా ఏదో అడిగేసి నాకేమీ రావని అతనిచేత అనిపించుకొని, ఏ కసరత్తు తరగతిలోనో పేరు చేర్చి వదిలివేద్దామని ఆ ఉపాధ్యాయుని ఉద్దేశం.

ఆ ఉద్దేశం ఎల్లమంద గ్రహించాడు. ఎప్పుడూ ఎవ్వరి జోలికీ, సొంఠికీ వెళ్ళని ఎల్లమందకు ఆ ఉపాధ్యాయుణ్ణి ఏడిపించాలని కయ్యాళి బుద్ది పుట్టింది.

ఎల్ల: నేను ఫుట్‌బాల్ ఆడతానండి. భీమవరం హైస్కూలు “బెల్సు” కప్పు పట్టుకువచ్చిన జట్టులో నేనున్నానండి

ఉపా: ఏమిటీ! నువ్వు ఫుట్‌బాల్ ఆడతావా! నాకు తెలియదే?

ఎల్ల: ఇవి చూస్తారా అండీ? (అతడు తన దేవదారు చెక్క పెట్టెలోనుంచి తన కప్పులు, మెడల్సు, షీల్డులు తీసి చూపించాడు.)

అడివి బాపిరాజు రచనలు - 7

8

నరుడు(సాంఘిక నవల)