పుట:Jagattu-Jiivamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

జగత్తు - జీవము

వేగం గల కాంతికిరణంతో కాక మనోవేగంతోనే వార్తలను పంపగల రనుకొందము. అట్టి సామర్థ్యం గల ఆంటారిస్ విజ్ఞాని తను నేడు చూస్తున్న నౌరోజా మహోత్సవం గురించి మృగవ్యాథకూటంలోని రిగెల్ (Rigel) నక్షత్రవాసికి మనోవేగంతో వార్త పంపినట్లయితే ఏమని చెప్పవలసి ఉంటుంది ? సుమారు 150 సంవత్సరాలైన పిదప రిగెల్ విజ్ఞాని హృదయంగమమైన భూలోక దృశ్యాన్ని చూడగలడని సందేశమంపాలి. భూలోకజీవితాన్ని పరిశీలింప కుతూహలమున్న రిగెల్ విజ్ఞాని ఆవార్త నెరిగినది మొదలు ఎప్పుడెప్పుడు 150 సవత్సరాలు గతిస్తాయా అని, ఆనాటి నౌరోజా మహోత్సవం నాడు బయలుదేరిన కాంతి ఎప్పుడు తన యంత్రంలో పడి ఆచక్కని దృశ్యాన్ని చూపుతుందా అని ఉవ్విళ్ళూరుతుంటాడు. అగుట, ఆంటారిస్ విజ్ఞానికి వర్తమానమైనది మనకు భూతకాల భాగమయినది రిగెల్ విజ్ఞానికి భవిష్యత్తుకానున్నది. అయితే, భూతభవిష్యద్వర్తమానములేవి ?

మనోవేగంతో నివేదించగల విజ్ఞానులు గల లోకాలన్నిటిలో నాటి నౌరోజా విషయమై వార్త ప్రాకిపోయిఉంటుంది. నక్షత్ర లోకాలలోనే కాదు, నెబ్యులాలకుకూడ వ్యాపించవచ్చును. కాని వెంటనే ఆయా లోకవాసులు ఆ దృశ్యాన్ని చూడలేరు. నాడు భూమినుండి బయలుదేరిన కాంతి సెకెనికి 186,000 మైళ్ళ చొప్పున, సంవత్సరానికి 6,000,000,000,000 మైళ్లచొప్పున శుష్కాకాశ యానం చేస్తూ ఆకాశార్ణవం తరిస్తూ, ఒక్కొక్క లోకాన్ని చేరుకోవాలి ఆ కాంతి ఎప్పుడేలోకాన్ని చేరుకొంటుందో ఆ లోకాని కప్పుడాదృశ్యం గోచరిస్తుంది. ఈ ప్రకారంగా ఒకసారి భూమినుండి బయలుదేరిన కాంతి ఆచంద్రతారార్కముగ దిగ్విలయం వ్యాపిస్తూ