పుట:Jagattu-Jiivamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలాకాశవైచిత్రి

51

కాలానికి జమ చేస్తూంది. ఇది అనుక్షణం సంభవిస్తూంది. అయినప్పటికి ఈకాల విభాగాల అగత్యముంది. అయితే, ఈ విభాగం భూలోక మొక్కదానికేనా, యావద్విశ్వానికి వర్తిస్తుందా అన్నది విచారణీయము.

జ్యేష్ఠానక్షత్ర కూటంలోని మహోజ్జ్వల తార అగు ఆంటారిసు (Antares) మనకు 360 కాంతి సంవత్సరాల దూరంలోనుంది. ఆంటారిస్‌లోగాని, ఆంటారిసుని ఆశ్రయించిన గ్రహాలలోగాని జీవమున్నదనుకొందము. ఆలోకవాసులు మనకన్న అత్యధిక మేదావంతులని జ్ఞానసంపన్నులని అంగీకరిద్దాము. అందున్న విజ్ఞానులలో ఒక మహామేధావి దూరదర్శిని (Telescope) కన్న ఉత్తమమైన సంకుల యంత్రాన్ని మన భూమివైపు త్రిప్పి భూలోక దృశ్యాలను పరిశీలిస్తున్నాడనుకొందము. చంద్రగోళంలోని పర్వతాలను, ఎడారులను మనం చూచుచున్నట్లే ఆంటారిస్‌లోని విజ్ఞాని భూలోకదృశ్యాలను స్పష్టంగా చూడగలడనుకొనుటలో దోషంలేదు. మనలోకంనుండి బయలుదేరిన కాంతి 360 సంవత్సరాలు ఆకాశయానంచేసిన పిదప ఆ యంత్రంలో జొరబడుతుంది. కాబట్టి, ఆ విజ్ఞాని 360 ఏండ్ల క్రిందటి దృశ్యాన్ని నేడు చూస్తూ ఉంటాడు.

అవి అక్బరు చక్రవర్తి పరిపాలిస్తున్నరోజులు. ఏకచ్ఛత్రాధిపత్యం వహించి, ఉదారమైన మత సహనంతో ప్రజాస్వామిక ప్రభుత్వంకన్న ఉత్తమమైన పధాలలో యావజ్జనామోదంగా రాజ్యపాలన మొనరిస్తున్నాడు. హిందూ మహమ్మదీయ తీవ్ర వైషమ్య వృక్షాన్ని కూకటివేళ్లతో పెఱకి పారవైచి అంతర్మతసామరస్యాభ్యుదయానికి అనేక నవ్యమార్గాల ననుగమించినవాడు అక్బరుచక్రవర్తి.