పుట:Jagattu-Jiivamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

జగత్తు - జీవము

శరీరంనుండి విముక్తినొంది ఆనంత్యగర్భంలో ప్రవేశించిన "అహం" యొక్క ఒక సూక్ష్మకణం మిగిలియున్నప్పటికి అది మరల ఆనంత్యంలో వర్ధిల్లవచ్చును. ఒకచలనం, ఒక స్పందం, ఒక ప్రసారంగాని నశించలేని ఆనంత్యంలో భావముమాత్ర మెట్లు నశించును ? భూలోకంలో వివిధానుభవములచే పెంపొందిన "అహం" వలె, ఆనంత్యంలో ప్రవేశించిన "అహం" యొక్క కణము వివిధ నూత్నానుభవాలచే ప్రవర్థమానంగా పెంపొంద వచ్చును. భూలోకంలో ప్రత్యేకచై తన్యం సంపాదించగలిగినప్పుడు, "అహా"నికి పరలోకంలో విశిష్టచై తన్యమేల ప్రాప్తించరాదు ? మన కతిప్రియమైన "అహం" ఒక్కదినంలో సృజింపబడలేదే ! మరణ కాలమప్పటి "అహం" జనన సమయ మప్పటి "అహం" గాదు. "అహం" నూతన ద్రవ్యాన్ని, భావాలని లంకించుకొంది ; విచిత్ర పరిణామ పరంపరకు లోనయింది. స్వసంకల్పంచేతకాక, విధిచేత ప్రమాదములచేత సంస్కృతి నొందినది. మన కజ్ఞేయ స్వభావం గలదానికేంద్రకం ఒకభావంకన్న సూక్ష్మం కావచ్చును.

భువిలో జన్మించినపిదప వాతావరణ సంపర్కంవలన ప్రకృతి శక్తుల నిత్యప్రవృత్తివలన మాతృగర్భమందున్నప్పటికంటె విచిత్ర విశేష పరిణామమొందిన మనము, మరణానంతరం భూమిని విడిచి విశాలము, అజ్ఞాతము, ఆనందదాయకము నగు నవీన వాతావరణం జొచ్చినప్పుడు ఎట్టి అత్యద్భుత పరిణామ మొందగలమో అని ఆశించుట సమంజసమే కదా ! దేహంనుండి నిర్గమించిన జీవాత్మ ఆనంత్యంలో మిళితం కాని పక్షమందు ఒక నూతనపదార్థం సంగ్రహించి, కాలాకాశముల నతిక్రమించి, నిరంతరాభ్యుదయ మొందుటకు సందియం లేదు.