పుట:Jagattu-Jiivamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితాంతము

35

జీవకళతో శోభాయమానంగా అమందానంద మొందుతే నేగణించును. ఆ అనుభవాలు నావికావు. వాటిని నేనెరుగను. "నావి" అనుభావం కలిగించు బంధములను మృత్యువంతరింపచేసింది. ఆ మనోభాగాలు కాలాకాశములలో తేలుచున్నను, అతి దూరనక్షత్రాలవలె నాకవి అజ్ఞేయములు. బొందిలో బందీకృతుడనై యున్న కాలంలో నాకు ప్రాప్తించిన అనుభవాలను, జ్ఞాపకమున్న విషయాలను సత్యమని భావిస్తాను" అంటుంది "అహం".

అయితే, చైతన్యంగా పరిణమించేది మన శరీరంనుండి ఉత్పన్నమైనదని భావించుదము. ఇంద్రియ దత్తవిషయాలను మనస్సు గ్రహించి సక్రమంగా ఏర్పరుస్తుంది. ఇంద్రియ సంబంధం వర్జించి, ఇంద్రియాలను తన యధీనమందుంచుకొనుటకు అనుక్షణం ప్రయత్నిస్తుంది. కాని, ఈ ప్రయత్నములకు ఆధారములై, ప్రోత్సహించునవి శ్రోత్రత్వక్చక్షూ రసన ఘ్రాణేంద్రియములేకదా !

ఇంద్రియాలే నశించినతరువాత మనస్సు యథాపూర్వంగా ఎట్లుండగలదు ? శరీరంతర్గతమై యున్నప్పుడు తన్ను తానెరిగిన మనస్సు, శరీరాన్ని విడిచి అనంత్యంలో పర్యటించునప్పుడు తన్నెట్లు గుర్తించుకోగలదు ? వయఃపరిపాకంతోనే క్షీణించు ధారణశక్తి, శరీరరహితమై అనంతకాలాకాశంలో తిరుగాడు మనస్సు తన్నుతా గుర్తించుకొనుటకు ఉపచరించునా ?

ఇంద్రియాతీతమైన దివ్యశక్తి మనలో గుప్తమై యున్న దనవచ్చును. దానిని ధృతికూడా కనుగొనలేదు. ఆ అంతశ్శక్తిని "అహం" మాత్రమెట్లు గుర్తించగలదు ? ఆ దివ్యశక్తియే మానవుడైతే వానితోనే అది నశించిపోతుంది.