పుట:Jagattu-Jiivamu.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
33
జీవితాంతము

విజ్ఞానం సూచిస్తున్నది. అవి, సంపూర్ణవినాశము, జీవ సంబంధ చై తన్యంతో అవస్థానము, చైతన్యరహితమైన అవస్థానము, నూతన మగు విశ్వచై తన్యంతో అవస్థానము. సాపేక్షయా వీటిలో దేనికి అధికావకాశమున్నదో విచారణీయము.

సంపూర్ణవినాశం అసంభవముగా తోచుచున్నది. అనంత్యంలో మనం బందీకృతులమై యున్నాము. అనంత్యానికి నిర్గమద్వారములు లేవు. ఒకవస్తువుగాని, ఒకభావంగాని ఈవిశ్వాన్ని, ఆకాశాన్ని, కాలాన్ని నిర్గమించి పోలేవు. మన శరీరంలోని పరమాణువుగాని, నరంయొక్క కంపంగాని, అవి నశించు ప్రదేశానికి పోలేవు. కొన్ని అర్పుదాలక్రితం తేజోవిహీనమై కృశించిన కొన్ని నక్షత్రాల మహోజ్వలకాంతి నిరంతరాకాశయానం చేస్తునే ఉన్నది. విశ్వంలో శూన్యతకు స్థానంలేదు. యోచించినకొద్దీ శూన్యత స్థానవిహీన మౌతుంది. కాబట్టి, జీవాత్మ నశించలేదు.

జీవసంబంధ చై తన్యంతో అవస్థానవిషయమై విచారించగా ప్రధానమైనది "అహం" భావము అనంత కాలాకాశంలో తనపై కేంద్రీకరించునట్లు మనదృష్టిని ఆకర్షించు ఈ "అహం" భావ విశేష మేమి ? "అహం" శరీరానుభవైక విశేషమా ? శరీరసంబంధలేని భావజనితమా ? మనస్సులేనియెడల శరీరానికి ఆత్మచైతన్య ముండగలదా ? మనశరీరం విడిచినపిదప మనస్సు ఏమగును ? మనస్సులేని శరీరాల - మృతశరీరాల - నెరుగుదుము. కాని, శరీరంలేని మనస్సు నెరుగము. ఇంద్రియరహితమైన, పోషకములైన ఇంద్రియ కరణ రహితమైన పరమబుద్ధి యుండవచ్చును. కాని, భూలోకానుభవములే జీవాధారములుగా గల మనబుద్ధి మరణానంతరము తన వ్యక్తిత్వమును గోల్పోకుండమనుచుండుట అసంభవము.