పుట:Jagattu-Jiivamu.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
28
జగత్తు - జీవము

మృత్యువంటే సామాన్యంగా మానవులు దద్దఱిల్లిపోతారు. మృత్యుభావం వారి హృదయాంతరాళంలోవ్యాపించి, దుఃఖప్రేరకమై పీడిస్తుంది. దాని నేవగించినకొలది ఆకర్షిస్తుంది; తలచి భీతిల్లిన కొలది భయోత్పాదకమౌతుంది. పారిపోజూచినవారిని వెన్నాడుతుంది ; మరచిపోనెంచువారిని గద్దించి పట్టి క్రుంగదీస్తుంది.

మృత్యుస్వరూపాన్నే మన మెరుగంగదా, మనకెందుకీ భయము ? దృఢచిత్తంతో మృత్యువునకెదురేగవలసిన సందర్భంలో దానికి వెన్నిచ్చుటకే ప్రయత్నిస్తాము. అనివార్యము, అనుల్లంఘనీయముకదా అనియైన మృత్యువునుగూర్చి నిశ్చితాభిప్రాయ మేర్పరచుకొనుటకు ప్రయత్నించము. మృత్యువు అగమ్యగోచరము. మృత్యుగాంభీర్యం అవగాహన చేసికొనుటకు జవసత్వము లుడిగే వరకు, శ్వాసోచ్ఛ్వాసములకే శక్తిలేనిసమయ మాసన్నమయేవరకు వేచియుంటాము. సాహసోద్దీపితమైన బుద్ధిగలవారమయ్యు మృత్యువునుగూర్చి యోచించుటకు జంకుతాము. దీని పర్యవసానమేమనగా: తుది ఘడియలలో తెన్నెరుగని ఉన్మత్తువలె హాహాకారములతో క్షోభించుట.

అట్లుగాక, కండబలము బుద్ధిబలము నిండుగా నున్నప్పుడే మృత్యువు నెదుర్కొనగలుగు స్థిరదృతి పెంపొందించుకొన్నచో, అవసాన సమయమున భయంకరయాతనాకల్లోలముల దగుల్కొను దుస్థితి ప్రాప్తించదు. భీతావృతమైన హృదయ అగాధములనుండి అవసానప్రార్థన ఆవేదనతో పై కుబుకనక్కరలేదు. మహోన్నత జీవితశిఖరముల నంటు ప్రసన్నభావ పరంపరలే జీవియొక్క అంత్యారాధనగా వెర్లివిరియగలవు. దుర్‌జ్ఞేయమగు జగచ్ఛక్తిని అవగాహన చేసికొనుటకై కాంక్షారహితుడై జీవిచేయు నిర్మలప్రయత్నంకన్న వేరొక దివ్యారాధన గలదా ?