పుట:Jagattu-Jiivamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగత్తు - జీవము

3. జీవితాంతము

[మారిస్‌మేటర్లింకు వ్రాసిన "మృత్యువు" అను చిన్న పుస్తకం ఈ వ్యాసానికి ముఖ్యాధారము. మేటర్లింకుపేరు విననివారుగాని, గ్రంధములు చదువనివారుగాని ఉండరు. ఆయన మహాపండితుడు, విజ్ఞాని, తత్త్వవేత్త. ఐహికావరణాన్ని భౌతిక విజ్ఞానదృష్టితో భేదించి, పరమయోగివలె విశ్వరహస్యాల నన్వేషించిన జ్ఞాని. ఆ పుస్తకంలో ఆకర్షకమైనవిశేషమొక్కటుంది. భౌతికవిజ్ఞాన ప్రతిపాదితములైన అందులోని భావములు ఉపనిషదర్థములట్లున్నవి.ఉత్ఫుల్లజ్ఞానేంద్రియంగల జీవి ఆధ్యాత్మిక దృష్టితో చూచినా, భౌతికదృష్టితో చూచినా పరమసత్యం గ్రహింపగలడన్న సత్యం మేటర్లింకు వ్రాతలలో గోచరిస్తుంది. ఆ సత్యం "మృత్యువు" లో నిబిడీకృతమైనది.]

               "జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్యచ,
                తస్మా దపరిహార్యార్థే నత్వంశోచితు మర్హసి. (భగవద్గీత)
      
               "చావును లేమియున్ మనుజ సంతతికిన్ వ్యసనంబు, లందులో
                జావున సంభవించెడు విచార మణంగు దినక్రమంబులో." (హరిశ్చంద్ర)

               "భుచి చావున్ సుఖసుప్తివోలె బడయందో నౌనుగా కక్కటా !
                దివి చావున్ నను చావనీకుము కపర్దిస్వామి ! మృత్యుంజయా !" (కంకణము)

                పరమసుఖదాయినివి, మహా దురిత కలిత
                ఘన భవార్ణవతరణకారిణివి నీవు,
                హీనమతులట్లు భీతిల్లకెల్ల వేళ
                మృత్యు దేవత : నిన్ను బ్రేమించువాడ.

జీవిత ప్రబంధానికి పంచ మాశ్వాసాంతగద్య ; జీవితనాటకానికి తుదిరంగాంతమున వ్రాలు అవనిక ; జీవితనదీప్రవాహానికి సాగరసంగమము ; జీవితవృక్షానికి ఆకురాల్పు ; జీవితమహారాధనకు స్వస్తి; చేతన ప్రవృత్తికి పరిసమాప్తి: ఇది జీవితంయొక్క పర్యవసానము, మృత్యువు.