పుట:Jagattu-Jiivamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవము

21

దృగ్విషయాలు నేడు రసాయనికశాస్త్ర సూత్రాలనో, పదార్థ విజ్ఞాన (Physics) సూత్రాలనో అవలంబిస్తూన్నట్లు తెలిసింది. అదిగాక, ఇతర పరమాణువులతో గలసి మిక్కిలి పెద్ద అణువులేర్పడుచూ, జీవపదార్థాలలో ప్రధానంగా గాన్పించు అంగార పరమాణువే గాని, జీవపదార్థాలకు నిర్జీవపదార్థాలకు గల భేదకారణం జీవశక్తికాదను నమ్మకం బలం కాజొచ్చింది.

అంగారపరమాణువునకిi అసామాన్య సామర్థ్యముండడం చేతనే విశ్వంలో జీవోత్పత్తి సాధ్యమైనట్లు కనిపిస్తూంది. లోహా (metal) లకును, లోహేతరా (non-metal) లకును సుమారు మధ్యనుండుటచేత రాసాయనికంగా అంగారం కొంత ప్రాముఖ్యం వహిస్తూన్నను, ఇతర పరమాణువులని బహుళంగా బంధించు సామర్థ్యం దాని కెట్లలవడిందో దానిభౌతికనిర్మాణంవలన నేటికిని తెలియదు. దాని పరమాణుభారం 12, పరమాణు క్రమాంకం 6. మూలపదార్థాలపట్టీ (Table of elements) లో అంగారాని కిరు పార్శ్వాలనున్న బోరను (Boron) నత్రజని పరమాణువులకు అంగార పరమాణువునకు గల భేదం స్వల్పమే. బోరను పరమాణువులో కన్న ఒకకక్షీయ ఎలక్ట్రాను అధికంగాను, నత్రజని పరమాణువులో కన్న ఒకటి తక్కువగను అంగార పరమాణువులో నున్నాయి. కాని, ఈ స్వల్పభేదమే జీవోత్పాదక సామర్థ్యానికి హేతువై యుంటుంది. ఈ హేతువు ప్రకృతిరహస్యాలలో ఒకటైయుండుట నిశ్చయం. కాని, అంగారానికి మహత్తర లక్షణాలెట్లు సంప్రాప్తమైనవో గణితశాస్త్రం నేటివరకు పెకలించలేదు.

పరమాణు క్రమాంకం 26 గల ఇనుము (iron) పరమాణువులో అయస్కాంతత్వం (magnetism) పుష్కలంగా నుంది.