జగత్తు - జీవము
2. జీవము
దిగ్వలయాన్ని చిక్కని చీకట్లు ఆవరించుకొన్న నిశాసమయంలో గగనాభిముఖుండై నానావర్ణదీపికలవలె వెలుగొందు తారకా నివహాన్ని తదేకధ్యానంతో చూస్తే మానవునిహృదయము విపరీత యోచనా పరంపరకాలవాలవవుతుంది. విశాలాకాశంలో సూక్ష్మకణాలట్లు గోచరించు నక్షత్రాలగూర్చి యోచించు సమయంలో సృష్టి విచిత్రాలు మనోరంగమున దృశ్యములవలె పరుగిడుతాయి. అప్పుడు, ధరాతలంపై అసంఖ్యాక జీవసంచయాల జన్మవృత్తాంతము, జీవకోటికి ప్రాప్తింపనున్న భవిష్యద్గతి తెలిసికోవడానికి చిత్తం కుతూహలమొందుతుంది. బహుక్లిష్టమైన ఇట్టి వివాదవిషయాల కిదమిద్ధమని సమాధానమీయలేక పోయినను బుద్ధికుశలతచే జీవులయందగ్రస్థాన మలంకరించిన మానవుడు తన సూక్ష్మగ్రహణశక్తి నుపయోగించి ప్రకృతి రహస్యాలను భేదింప నుంకించి కొంతవర కుత్తీర్ణుడగుచున్నాడు.
నిర్మలాకాశంలో గోచరంగాను, అసహాయనేత్రానికిగోచరంగాను ఉన్న నక్షత్రసముదాయంలో మనభూమికన్న చిన్నవి కొలదిమాత్రమే గలవు. లక్షలకొలది భూగోళాలని అవలీల కుక్షి యందిడుకొను నక్షత్రాలు నభోమండలంలో అత్యధికంగాఉన్నాయి. కోటానకోట్ల ప్రపంచాలని అతి సులభంగా గ్రసింపగల బృహత్తారకలుగూడ అచ్చటచ్చటున్నాయి. నక్షత్రసంఖ్య దురూహ్యము. భూలోక సమస్తసముద్రతీరాలపై ఎన్ని ఇసుకరేణువులున్నవో, సుమారన్ని