పుట:Jagattu-Jiivamu.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
6
జగత్తు - జీవము

యానంచేసిన కాంతి తీక్ష్ణత గోల్పోవుటచే మనకు గోచరించుట కష్టం. కాబట్టి, యంత్రగోచరం కానిమాత్రాన ఆకాశం నక్షత్ర శూన్యమని భావించుటకు అవకాశంలేదు.

ఆకాశంలో మనకత్యంత సన్నిహితగ్రహమైన చంద్రుడు 240,000 మైళు దూరంగాను. అతిదూరస్థగ్రహం ప్లూటో 368 కోట్ల మైళ్లు దూరంగాను ఉన్నాయి. 750 కోట్ల మైళ్లు వ్యాసంగల గోళం మన సౌరజగత్తు : విశ్వంలో సూక్ష్మబిందువు. ప్లూటోనుదాటి నక్షత్రలోకం ప్రవేశిస్తే ఆదూరాలు మైళ్లలోకాక కాంతి వత్సరాలలలో వాకొనవలసిఉంటుంది. అనేక సహస్రనక్షత్ర స్థాపితమైన మన గెలాక్సీమండలం ప్రారంభమవుతుంది. అందులో లక్షలకొలది నెబ్యులాలున్నాయి. దానివ్యాసం 3 లక్షల కాంతివత్సరాలు. అదే దుగ్థపధం (milky way). సెకెనుకి 400 మైళ్లవేగంతో ఈ దుగ్థపధం ఒక ద్రవ్యశకలంవలె ఆకాశయానం చేస్తూంది. దీని వెనుక అధికగెలాక్సీక నెబ్యులాలు (extra - galactic nebulae), సర్పిల (spiral) నెబ్యులాలు మన జగత్తుతో సంబంధంలేనివి ఉన్నాయి. దూరతమమైన నెబ్యులాదూరం ఇప్పటికి కనుపించినవాటిలో 14 కోట్ల కాంతి సంవత్సరాలని విజ్ఞానులు గణించేరు.

యంత్రదృష్టి చొరలేని ఆకాశంలోగల అనన్వేషిత ప్రదేశాలలో జగత్తుపై జగత్తు ఆనంత్యంవరకు ఉండవలసిందే !

ఊహకందని నెబ్యులామండలాన్ని ఈవిధంగా జీన్సు పండితుడు చిత్రించుకొనమన్నాడు : 2 మైళ్లు వ్యాసంగల గోళంలో 25 గజాలకొకటి చొప్పున 50 టన్నుల బిస్కట్లనుపేర్చగా, 100 అంగుళాల దూరదర్శిని చూడగల ఆకాశాన్ని ఈగోళం నిరూపిస్తుంది.