తొలిపలుకు
ఈ పుస్తక ప్రచురణానికెట్టి అపదేశమక్కఱలేదు. ఆంగ్లభాషా పరిచయంలేని పండితవర్గానికి భౌతికవిజ్ఞానంయొక్క యధార్థ ప్రగతి తెలియదు. మన ప్రాచీన విజ్ఞానంతో రవంతేని సంఘర్షణ లేనట్టి భౌతిక విజ్ఞానాభిప్రాయాలు జనసామాన్యంలో వ్యాపించినందువల్ల కలుగు లాభమధికము. భౌతికవిజ్ఞానం నాస్తికత్వానికి ప్రాపైనదను అపవాద తొలగిపోగలదు.
విశ్వవిషయమై ఆధునిక విజ్ఞానం పెంపొందించు అభిప్రాయాలను చర్చించి, జగన్నిర్మాణంగురించి తెలిసికొన్నప్పుడు సూర్యమండల జనన విధానమును, గ్రహాల భౌతిక పరిస్థితులలో కలుగు మార్పులును, జీవోద్బవమును, భూమియొక్క భవిష్యత్తును స్థూలంగా గ్రహించి, భూలోకజీవితం సమాప్తమైనంత ఐహికానుభవాలేమికానున్నవో విమర్శించి, భూమినివిడిచి ఆకాశంలో పడినప్పుడు మృత్యువన్నపదం అర్థహీనమౌతుందని ఖగోళ విజ్ఞానరీత్యా గోచరిస్తున్నట్లున్నదను మహత్తరవిషయమున్ను, కాలభావంయొక్క వై చిత్రిన్ని నివేదించడమయింది.
గురుతుల్యులగు మహామహోపాధ్యాయ న్యాయభూషణ శ్రీ పేరి లక్ష్మీనారాయణశాస్త్రిగారు ఈ పొత్తమున కుపోద్ఘాతం వ్రాసినందుకు వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు.
మొదటి నాలుగు ప్రకరణములను క్రమంగా ప్రకటించిన "అడ్వర్టైజరు", "భారతి", "ఆంధ్ర వారపత్రిక", "ఆనందవాణి" సంపాదకులకు నే కృతజ్ఞుడను.