పుట:Jadakucchulu1925.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోయిల

గీ. మఱచిపోయిన యేక విమణిశ్---
   గీతికలు మాకు విన్చెద వో తలంప
   శాంతియెఱుఁగని యీ మనుసంతతులకుఁ
   దెలియఁ బడదింతయుఁ దదర్థముల తెరంగు.

గీ. తగులపుందీపియును, బిడ్డమొగము నెడలఁ
    దెగనికాంక్షయు, స్వార్థవృత్తినిరతియుఁ ద్య
    జించి, తన దేశమాత సేవించు వీరు
    నెవని మఱచితిమో వచింతువు పికంబ!

గీ. నిండుకవుగిండ్ల కెడఁబడి మండు విరహ
    మునఁ దపించెడి యే ప్రవాసినులఁగాంచి
    మెత్తనగు గుండె జాలి రేకెత్తవచ్చి
    తెలుతువో నాయికాదేశములను పికమ!

చం. అకట!నిషాద! చేతు లెటులాడుగదోయి! యభేదమోహకౌ
      తుకమున మైజడుల్ మఱచి తూలుక పోతము సేయగా! వధిం
      పకు వధియింపకంచు పికమా! యనుకంప తొలంక సాశ్రుగీ
      తికలను వేడుకొందొ! కలదే! తెలియంగ భవద్విచారమున్.

ఉ. ముత్తెపుటశ్రువుల్ సయనముల్ డిగజాఱఁగ మాటరాని డ
     గ్గుత్తికతోడనంపకపు గూతుఁ గవుంగిటఁ బాయలేనియే
     మెత్తనితల్లికన్న చెలిమిన్ మధురంబుగఁ గీరితింతువో
     కొత్తయిగుళ్లమేపరి! యెఱుంగముగా! భవదీయబోధలన్.