పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

83



18. సర్వగుణములు, సర్వ తేజస్సులు, సర్వబలములు గల్గి యీ సర్వ జగత్తును వ్యాపించి, ప్రకాశించు నొకానొక ఉత్కృష్టమైన దానవు నీవు.


19. ఓ తల్లీ ! ఆకాశ శరీరిణివైన నీవు శరీరములేని సద్వస్తువునకు భార్యవైతివి. యుక్తిగల పండితులచే నీవు మహేశ్వరివని చెప్ప బడుచుంటివి.


20. ఈశ్వరుడే కారణమని చెప్పువారి కామె పరమమైన మాయ యగుచున్నది. సాంఖ్యవాదుల కామె ప్రకృతియై, యోగులకు కుండలినీ యగుచున్నది.


21. 'పంచదశి' యను నుత్తమ విద్యను జపించువారి కామె లలిత యగుచున్నది. శ్రేష్ఠమైన నవార్ణమంత్రమును భజించువారి కామె చండి యగుచున్నది. (నవార్ణ మంత్రములో 9 అక్షరము లుండును. అర్ణము అనగా వర్ణము.)


22. ఆ చండి శచీదేవియొక్క ఉత్తమమైన కారణరూపమై నా సంతోషముకొఱకును, కార్యశరీరమై స్వర్గమం దింద్రుని సంతోషముకొఱకును ప్రకాశించుచున్నది.


23. వ్యోమమే శరీరముగాగల యీమె సర్వజగత్తులయొక్క చాలన సూత్రమును వశ మొనర్చుకొని తిరుగ (సృష్టి) నిర్వహించుటకై దివ్యతనువులుగల స్త్రీత్రయమగుచున్నది.


24. ఓ తల్లీ ! చిరకాలమునుండి జయములేని ఈ స్వకీయ దేశమును రక్షించుటకు యీ సేవకుని భయరహితునిగాను, సమర్ధునిగాను జేయుము.