పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

45



9. ఓ దేవీ ! యత్నము జేయనివాడుగూడ పూర్ణసమాధి బొంద వచ్చును, అభ్యసించుచున్నను యోగస్థితి నొకడు పొందక పోవచ్చును.


10. ఓ యింద్రాణీ ! ఏది యత్యంత అసాధ్యమో, అది సమీపము గావచ్చును ; సర్వవిధముల సాధ్యమైనది దూరము గావచ్చును.


11. ముని సంఘములచే గానము చేయబడునది, యింద్రునిగూడ శాసించునది, త్రిలోకజనని యగు నొకానొక మాయను మేము గానము చేయుచుంటిమి.


12. సకల విద్యాధీశ్వరీ ! ఓ తల్లీ ! విశ్వముకంటె నధికుడైన ఆ యింద్రుని వశ మొనర్చుకొనుటకు నీవే విద్య నాశ్రయించితివి ?


13. ఓ దేవీ ! స్త్రీ మోహమూహింపనలవిగానిది. నీ కనుబొమ్మల చేష్టల కనుచరుడగుటవలన నీ వతనియందు చెప్పనలవిగాని దయ జూపియుందువు.


14. ఓ యింద్రాణీ ! అట్లుగానిచో, నీ సౌందర్య ముత్కృష్ట మైనది, యసాధారణమైనది యని చెప్పవచ్చును. ఏ సౌందర్య మాతని చిత్తమును సులభముగా నపహరించుటకు సమర్ధమగుచున్నదో

(ఆ సౌందర్య మసాధారణోత్కృష్టమైనదని యన్వయము.)


15. ఓ దేవీ ! నీ నేత్రము తన వీక్షణ మాత్రముచేతనే మత్తులైన దనుజుల చిత్తములను ధైర్య తేజోవిహీనములుగా చేయు చున్నది.