పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

43



1. పరిశుభ్రమైన వెన్నెలవలె గన్పట్టు కాంతులు గల్గి ప్రకాశించు ఇంద్రాణీ దరహాసము నాకు క్షేమము కొఱకగుగాక.


2. దయ యనెడి యమృతముచే తడుపబడు నట్టిది, శక్తిమంతమైనది యగు ఇంద్రాణీ వీక్షణము భారతభూమియొక్క దౌర్బల్యమును హరించుగాక.


3. ఏ దేవి సంకల్పించినప్పుడు సాధ్యాసాధ్య విచారము లేశమైన నుండదో, అట్టి దేవికి నేను నమస్కరింతును.


4. ఓ స్వర్గాధీశ్వరీ ! నీవు సంకల్పించినచో సిద్ధి, నిష్ఫలత యనునవి తమ నైసర్గికస్థితి నతిక్రమించియైనను జరిగితీరును.


5. నీ సంకల్పమునుబట్టి మూఢుడైనను, నుత్తమరీతిని విద్యలందు సిద్ధి బొందును. అత్యంత మేధావియైనను, కృతకృత్యుడు కాజాలడు.


6. ఓ తల్లీ ! నీ సంకల్పానుసారము మూఢునివల్ల శాస్త్రముత్పన్నము కావచ్చును, పండితుడైనను అకస్మాత్తుగా భ్రాంతి బొందవచ్చును.


7. బలహీనులై కొలదిమంది యున్నను సంగ్రామమందు విజయ మొందవచ్చును, చాలమంది యుండి శక్తిమంతులైనను ఘోరాపజయము బొందవచ్చును.


8. కీర్తిలేని వంశములు నృపపీఠమందు బ్రకాశించుచు, మిగుల బలముగల రాజకులములు నశించవచ్చును.