పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

109



18. ఓ తల్లీ ! పూర్వజన్మ సుకృతబల ముండుగాక, లేకపోవుగాక. ఇప్పుడు నీ పదయుగము నే నాశ్రయింతును. రక్షింపుము, మానుము.

(ప్రే రేపించునది బుద్ధి యగునుగాని జడమైన కర్మ కాజాలదు. కనుక బుద్ధిని సవ్యమొనర్చుకొని, జడమైన కర్మఫలము నారాధించుట మాని, చిద్రూపిణి యగు దేవత నాశ్రయించవలెను.)


19. ఓ తల్లీ ! ఇప్పు డేమియు లేదు. (పూర్వజన్మ కర్మఫలముచొప్పున నైశ్వర్య మిప్పు డేమియులేదు). ఐశ్వర్యమును (ప్రస్తుత కర్మ ఫలముగా) పొందగోరినచో తరువాత ఏమిటి ? (ఈ జన్మలోని కర్మకు ఫలము) మఱియొక జన్మలో నివ్వడమనెడి ప్రసక్తియేల ?


20. ఓ శచీ ! ఇతర జన్మలం దెక్కువ మంగళములు నేను కోరుట లేదు, స్వర్గసుఖమైన కోరుట లేదు. నా కభిమతమగు ఫలమును ఇప్పుడు నేను కోరుచుంటిని. ఇచ్చిన నిమ్ము, లేదామానుము. (ఫల మిచ్చునది దైవము కనుక నిప్పటి పుణ్యకర్మకు దైవ మిప్పుడైన నీయగలదని భావము.)


21. ఓ దేవీ ! భూలోకమునుండికాని, నిరుపమానమగు నాకాశము నుండికాని, కాంతినిధియగు సూర్యునినుండిగాని నా కోర్కెను నెరవేర్పుము.


22. ఓ తల్లీ ! నీవు సర్వేశ్వరివి కనుక నీవీయఁదలఁచినచో నిన్ను ఏలోకమునందును నీ భర్తనువలె నడ్డగింపగలవారు లేరు.


23. ఓ దేవీ ! ఇచ్చిన నిమ్ము, లేదా మానుము. రక్షింపుము, మానుము. పావనమైన నీ పాదములుమాత్రము నేనువిడువను.