పుట:Himabindu by Adivi Bapiraju.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్ధరథములు తేలికయైన గట్టిదారువులతో నిర్మింపబడును. చక్రములు బరువైన గట్టిదారువుతో నిర్మింపబడును. రథనిర్మాణము, వానిని మంచి స్థితిలో నుంచుట, వానియం దుంచవలసిన ఆయుధములు, రథసూతులు, రథాశ్వములు, వారి పోషణఅంతయు రథాధ్యక్షుని అధికారమున నుండును.

రథము వెనుక అశ్వ సైన్యము ముఖ్యమైనది. దేశములోని గుఱ్ఱము లన్నిటి విషయము, వాని జాతి, సుడులు, వాని ఈడు, గుణగణములు మొదలైన విషయము లన్నియు ఒక గ్రంథములో వ్రాయుదురు. జాతినిబట్టి లక్షణములనుబట్టియు గుఱ్ఱముల యుద్ధములో జేర్చుకొందురు.

వేగ, మధ్యవేగ, మందగతిగలవి; తీష్ణ, మధ్యమ, శాంతి స్వభావములు గలవిగా గుఱ్ఱముల వేరుచేయుదురు. అవి ఉద్భవించిన దేశములబట్టి వానిని వివిధనామముల పిలుతురు. కాంభోజ, సింధు, ఆరట్ట, వనాయు, బాహ్లిక తురంగ, సౌవీర, సాపేయ, తైతల, పారసీకము లని వాని పేర్లు.

వీనిలో కర్కశములగు అశ్వములే రథములకు పనికివచ్చును. పారసీక ననాయుజ తురంగ జాతులు ఆశ్వికులకు మంచివి. కాంభోజ, సైంధవ ఆరట్టజ బాహ్లికాశ్వములు రథముల కుత్తమమైనవి. కులీనములు ఆజానేయములు చక్రవర్తి రథములకు ప్రత్యేకింప బడును.

మంచిజాతి అశ్వముఖము ముప్పదిరెండు అంగుళము లుండవలెను. అశ్వము పొడవు ముఖము పొడవునకు అయిదురెట్లుండవలెను. జంఘలు ఇరువది అంగుళములు, ఎత్తు ఎనుబది అంగుళములు, వక్షము చుట్టు నూరు అంగుళములుండవలెను అని ఏర్పరచిరి. రెండవజాతి గుర్రములు కొలతలలో మూడంగుళములు తక్కువ యుండును.

విరోధులు గుర్రములకు విషమిచ్చి చంపించుచుందురు. కావున వాటి శాలలు విశాలముగ కట్టుదిట్టములు కలిగియుండును. శాలలలో కోతులు ఆరోగ్యము కొరకు, పిల్లులు, మయూరములు, ముంగిసలు, జింకలు పాముల చంపుటకు రక్షకులనుంచుదురు. చిలుకలు, మైనపుగోరు వంకలు, పికిలిపిట్టలు విషము పరిసరముల నున్నపుడు అల్లరిచేయును. కోకిలలు విషము ప్రాంతములనున్న చనిపోవును. కౌజుపిట్టలకు విషాఘ్రాణముచే కన్నులెర్రపడును. 

3. మహాసభ

ఆంధ్ర సైన్యములలో అశ్వముల కిచ్చు యుద్ధశిక్షవర్తనము, కృప వేణుక వర్ధమానకము, యమకము, నీచైర్గతము, ప్రకీర్ణక, ఊర్నిమార్స, త్రితాళ, శరభప్లుత, శరభక్రీడిత, సింహాయత, కపిప్లుత, భేకప్లుత, ఏకప్లుత, ఏక పాదప్లుత, కోకిలసంచారి, హ్రస్వ, బకచారి, ఘోరణకి, మయూర, నాకుల, వారాహ, సంజ్ఞాప్రతీకార, మార్గవిక్రమ, భారవాహ, ధారా, ఉపకంఠ, ఉపజవ, మొదలగు గతులతో, నడకలతో కూడియుండును.

అశ్వము ఎట్టిధ్వనికైనను బెదరకూడదు. అశ్వికుడు లేకపోయినను యుద్ధభూమిని వదలరాదు! ఉత్తమాశ్వము పన్నెండు యోజనములకన్న ఎక్కువ పరుగిడకూడదు. (ఇప్పటి ఆరు ముప్పాతిక మైళ్ళు) సాధారణముగ పదియోజనమున్నర పరుగిడవలెను. వృద్ధాశ్వములను పనిచేయించక ఆహారమిచ్చి పెంచెదరు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 87 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)