మోయుటకు మాత్రము పనికి వచ్చును. భద్రజాతి దంతావళము లన్నియు విదేహమునుండి వచ్చును.
సైన్యశిబిరములలో గజములకు శాలలు లేకపోయినను, సైన్యము రాజధానీ నగరమున నున్నప్పుడు వానికి శాలలున్నవి. శాల ఏనుగు పొడుగు ఎంత యుండునో అంత ఎత్తుండవలెను. ఏనుగు ఎత్తులో సగము శాలవెడల్పు. మగ ఏనుగు లన్నిటికి శాలలు వేరు, ఆడ ఏనుగులశాలలు వేరు. శాలకు వెనుకగా ఏనుగు నిద్రబోవు స్థలముండును. ఏనుగు దేనినైన యానుకొని నిద్రబోవును. కావున శాలవెనుక ఎత్తయిన ప్రదేశము నిర్మింతురు.
ఏనుగులకు శిక్షకులు వేరు, మావటివారు వేరు. శిక్షకులు గజశాస్త్రజ్ఞులు. మావటివారలలో ప్రథమశ్రేణివారు యుద్ధకాలమందు ఏనుగులను నడుపుదురు. వారికి గజయుద్ధపు మెలకువలన్నియు కరతలామలకములు. ఏ విధమైన అస్త్రము వచ్చినను దానిని తప్పుకొనునట్లు ఏనుగును నడప వలెను. గజవేగమును కాలమునకు తగినట్లు వృద్ధి చేయవలెను. ఏనుగునకు వంటవండువారు వేరు. సాధారణపు మావటివాండ్రు ఉదయమున నేనుగును నదికిగాని సరోవరమునకుగాని తీసికొనిపోయి కడుగవలయును. దినాంతమందు, మూడవయా మధ్య మందు మరల కడుగవలయును, యుద్ధ గజములకు తక్కిన యూధముతోబాటు నడచుట, పరుగిడుట, పక్కకు తప్పుకొనుట, యెదురుగ ముఖమునుంచి మూలగా ముందుకుసాగుట, చటుక్కున వంగుట, తొండముతో గజ గదాదండము పుచ్చుకొని గజమును రథమును ఆశ్వికుని తాడించుట, మూర్ధములతో గజముల రథముల తాకుట, వేగముగపోయి తాకుట, మూర్ధములకు బిగించిన శూలముతో తలవంచి దేనినైన తాకుట, రెండుకాళ్ళు పైకెత్తి నిలుచుండి కాళ్ళతో మర్ధించుట, తొండముతో గజముమీదనుండి రథముమీదనుండి గుఱ్ఱముమీదనుండి వీరుల లాగిపార వేయుట, కోటగోడల గోపురద్వారముల మూర్ధముతో తాకుట, గజ గదలతో మహా దండములతో తాకి పగులగొట్టుట, తనవారిని ఎత్తుకొని కంఠమున మావటివానికి అందిచ్చుట, చప్పుడుచేయక నడచుట, కాళ్ళతో మర్దించుచు ఉరుకుట, ఈదుట, అగ్నిబాణముల పట్టుకొని మట్టిలో దూర్చి నీటిలోముంచి ఆర్పుట, తిరిగి విరోధులపై విసరివేయుట అగ్నిదండముతోడ విరోధుల కాల్చుట-ఇవి యుద్ధగజములు నేర్చుకొన వలసిన యుద్ధతంత్రములు.
ఏనుగులకు వైద్యము చేయువారును, భూతవైద్యులు నున్నారు. ఆంధ్రసైన్యముల గజహారము కొలత - ఒక ద్రోణము బియ్యము, అర్ధ ఆఢకము నువ్వులనూనె, మూడు ప్రస్థముల నేయి, పదిపలముల ఉప్పు, ఏబది పలముల నారి కేళములు అరటికాయలు, రెండు ఆఢకముల పెరుగు, పదిపలములబెల్లము, ఒక ఆడకము మదిరము, రెండు ఆఢకముల పాలు, రెండు భారముల యవగడ్డి, రెండుంగాలు భారముల ఆకుపచ్చగడ్డి, భారము లో ఆరవవంతు వట్టిగడ్డి ఆకు పప్పు దినుసుల మొక్కలును.
గజసైన్యము వెనుక ముఖ్య యుద్ధాంగము రథము. రథములలో నాలు గుఱ్ఱములు పూనిన రథములు, రెండు గుఱ్ఱముల రథములు, ఏకాశ్వ రథములు అని మూడు రకములున్నవి. ప్రయాణమునకు, విలాసవిహారమునకు రథములు వేరు. యుద్ధరథములు వేరు. విలాస రథములకు ఎనిమిది గుఱ్ఱములుకూడ ఒక్కొకప్పుడుండును.
అడివి బాపిరాజు రచనలు - 2
• 86 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)