పుట:Himabindu by Adivi Bapiraju.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పారిపోవునాడు కొనయూపిరితో సార్వభౌమునికై యెదురుజూడదా? ఇది నాయాజ్ఞగా తెలుపుడు. ఒక్క చారుడును ఉజ్జయినికోట వీడవలదు. వరితవుడుగంజి కాచి ప్రతివారును మధ్యాహ్నము త్రాగవలయును. యవధాన్యపుముద్ద ఒకపూటను, బియ్యపు ముద్ద రెండవపూటను ఉపయోగింపవలయును. విరోధుల ఆయుధములు వ్యయము కానిండు. ముఖ్యావసర మగునపుడే మనయస్త్రముల నుపయోగించెదము గాక! కోటబురుజులలో కొలది గాయము తగిలిన వెంటనే వేరొకడా స్థలము నాక్రమింపవలయును. ముఖ్యావసరములై నప్పుడుమాత్రము సగము బలముతో యుద్ధము సలిపెదము” అని మేఘగర్జనముల నాత డాజ్ఞాపనల నెరుకజేసెను. అందరును మహోత్సాహముతో “విజయ! సమవర్తవిజయ!” అని జయపెట్టిరి. శంఖముల నొత్తిరి. భేరీనినాదములు బయల్వెడలెను.

విరోధు లీ జయధ్వానములు విని నివ్వెరగందిరి. చక్రవర్తి వచ్చుచున్నాడేమోయని భయపడిరి. అప్పుడు మాళ్వాధిపతియు మంత్రులు తదితరులు నొక సభ కావించుకొనిరి. వారి కేమియు తోచుటలేదు. ఏ వార్తలు తెలియుటలేదు. ఒకవేళ చక్రవర్తి వచ్చుచున్నాడేమో! ఏది యెట్లయినను రెండు రోజులలోపల ఆంధ్రుల నుగ్గుచేసి కోటజొరబడి స్వాధీనము చేసికొనకున్న తమ ముందుగతి ఏమగునో?

2. జైత్రయాత్ర

శ్రీముఖసాతవాహనుని సైన్యములు ఆంధ్రరాజ్యరత్నమగు ధాన్యకటకనగరమున కృష్ణానదియావల మహాసైన్యస్థానమున విడిసియున్నవి. మహాసైన్య స్థానము - పది గోరుతముల పొడవున నున్నది. వెడల్పు మూడు గోరుతములు.

ఆ స్థలమంతయు మహానగరమువలె నేర్పాటు గావింపబడినది. చక్కని వీధులు, రాజమార్గములు, శృంగాటకములు, వీధుల పొడుగున శిబిరములు, వైద్యశాలలు, వర్తకవీధులు, క్రయ విక్రయశాలలు, వినోద మందిరములు, మదిర మందిరములు విశ్వకర్మ ఒక రాత్రిలో నిర్మించిన ఇంద్రనగరమువలె ఆ సైన్య స్థానము వికసించినది.

ఒకయెడ గజయూధముల భాగము. అచ్చట రెండువేల గజము లున్నవి. దేనినైన హింస యొనర్చిన ఊరకుందురేమో కాని, అడవిలోనైన గజమును ప్రబలకారణములేక చంపినవారికి మరణమే దండనము. గజముల పట్టుకొనుట, వానిని పెంచుట, వాని భోజనము, మావటి వాండ్రు, గజాలంకారములు, కవచములు, తోత్రకములు, నిగళములు, ఆలానములు, అంకుశములు, వరత్రములు, అంబారులు-ఇవి అన్నియు గజాధ్యక్షుని యధికారములో నుండును. ఒక్కొక్క ఏనుగునకు నలుగురు మావటీ లుందురు. ఇద్దరు పదాతులు, ఇద్దరు సేవకు లుందురు. భద్రదంతావళమునకు ఇద్దరు ఆలంకారికులు, ఎనమండుగురు మావటీలు, నలుగురు సేవకులు. అధివసించువాడు గజసాహిణి. అతనికి కవచరక్షకుడొకడును, ఆయుధకు డొకడును ఉందురు. భద్రగజమునకు రక్షణగా సాధారణగజములు రెండు ఈవలావల నుండును.

ఆంధ్రులు విదేహమునుండి అత్యుత్తమమైన ఏనుగులు కొనుచుండిరి. తమదేశములోని దశార్ణ, అపరాంతములనుండి మధ్యజాతి ఏనుగుల సముపార్జించెదరు. సురాష్ట్రమునుండి హీనజాతులు వచ్చును. సురాష్ట్రగజములు, సరకులు, శిబిరములు

అడివి బాపిరాజు రచనలు - 2

• 85 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)