పుట:Himabindu by Adivi Bapiraju.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(ద్వితీయ భాగం)

1. ముట్టడి

మవర్తి యుద్ధమున ఆరితేరిన బంటు. కాని వినీతమతికి సర్వ విధముల తోడగుటయేగాక, ఆత డుపశమించునప్పుడు తానే అధిపత్యము వహించి లగ్గల కెగబ్రాకు విరోధుల తోలివేయుచుండెను. కోటగోడలకు కందకమునకు దూరముగా విరోధిసైన్యముల అఖండయంత్రప్రయోగ వృష్టిచే తరిమివేయుచుండెను.

ఒకనాడు సమవర్తి గుఱ్ఱముపై నధివసించి, కోటగోడలకు, బురుజులకు, ద్వారములకు బోవు రహస్యపుదారులన్నియు గలియు మూలప్రదేశమున నిలిచి, తనకడనున్న చారులతో మాట్లాడుచు నాలోచించుకొనుచుండెను.

ఒకడు: స్వామీ, మనకడనున్న భోజనసామాగ్రులు కొంచె మెచ్చు తగ్గుగ అయిపోయినవి. శత్రువుల రహస్యచారులు మనము త్రాగునీళ్ళలో రెండుసార్లు విషము కలిపినారు. ప్రయత్నము విఫలమైనను ఎప్పటికప్పుడు భయముగా నున్నది.

ఇంకొకడు: ఆర్యా! ఉన్న నాలుగు సర్వతోభద్రములు (రాళ్ళు విసరునవి) చూర్ణములైనవి. పదునాలుగు జామదగ్న్యములు (వివిధబాణముల పరపు యంత్రములు) పాడై ఒక్క యంత్రము మాత్రము ఉత్తరద్వారముకడ పని చేయుచున్నది. ఆరు దేవదండములు (అనేకములగు పెద్ద మేకులతో వాడిగా నున్న దూలములను విసరునది), పదునొకండు విశ్వశాఖలికములు (బరువువస్తువులను వేగముగా విస్తరి విరోధుల పిప్పిచేయు యంత్రములు), శతఘ్నులు, వరాహకర్ణములు, కనాయములు, కల్పణములు మొదలగు ఉపకరణము లయిపోనున్నవి.

మూడవయతడు: ఇంతవరకు పదిదినములనుండి మన వేగులవారు పైనుండి లోనికి వచ్చుటగాని, లోనుండి పైకి పోవుటగాని జరుగుటలేదు. మూడు రాత్రులలో పదునలుగురు చారులను పంపినాము. కాని విరోధులు వారిని గ్రహించి కారాగృహముల నుంచి నిజమునరయుటకు వారిని బాధించు చున్నారని తెలియుచున్నది. ఎంతమంది వెళ్ళినారో అందరి పేరులు తెలియజేసినారు.

నాల్గవదళవాయి: వీరోత్తమా, శస్త్రవైద్యుల మందులై పోయినవి. గాయములు తగిలినవారు అదృష్టవంతులైనచో జీవించవలయును. లేనిచో దివంగతులు కావలయును.

సమవర్తికన్నులు మిరుమిట్లు గొలిపినవి. అతనికి భయమనునదిలేదు. శత్రువులు తన్ను పెట్టు బాధలు అతనికి మరింత ఉత్సాహము కలుగ జేయును. మీసములు మెలి పెట్టుచు “ఆంధ్ర సైన్యముల నన్నింటిని నురుమాడినను, వారి అస్త్రముల నుగ్గుచేసినను, వారి ఆత్మలు విజయమొందును. మన కేమియు భయములేదు. చక్రవర్తి నా వెంటనే శుభదినమున బయలు దేరియుండును. వారు అడవులవెంట రారు. సైన్యము లనేకము లగుట కళింగమునుండి వచ్చెదరు కాని, ఇచటికి చేరుటకు ముప్పది అయిదు దివా రాత్రములు పట్టును. నేను వచ్చి యిరువది యేడు అహస్సులయినది. కావున నింక నొక పదునాలుగు దినంబులు మనము మహారణంబు సలిపి చక్రవర్తికై యెదురు చూడవలయును. శాతవాహన పతాకంబగు “సింహము” ఉజ్జయినీ కోటగోడలనుండి

అడివి బాపిరాజు రచనలు - 2

• 84 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)