పుట:Himabindu by Adivi Bapiraju.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముక్తావళీదేవి పన్నీట మొగము కడుగుకొని పరిచారిక లందిచ్చు శుభ్ర వసనములచే తుడుచుకొనుచు నొక పీఠముపై నధివసించియుండెను. ఆమె మాటలలో యవనాపభ్రంశోచ్చారణ కొంచెము కానవచ్చుచుండును.

“అమ్మమ్మా, అమ్మమ్మా” అని ఇంతలో హిమబిందు వచ్చినంతట మొగము తుడుచుకొను వస్త్రము తీసి ముక్తావళీదేవి మనుమరాలిని చూచి....

“అమ్మడు! ఇదేమి? యిటుల వచ్చితివి? ఆ పరుగులేమి? నీవెప్పుడును అల్లరిపిల్లవు. నీకు ఒక్కక్షణము నిలకడలేదాయెను. ఏ మంత తొందర” యని ప్రశ్నించినది.

హిమ: అమ్మమ్మా, నీవు శక్తిమతీదేవిని ఎరుగుదువా?

ముక్తా: ఎరుగుదునమ్మా. నా కన్నతల్లియు, ఆమెయు చిన్నతనమున అతి స్నేహమున మెలగువారు. వారిరువురకు సంగీతమున, నాట్యమున, సాహిత్యమున గురువులందరు నొకరే. శక్తిమతియింటికి నా కన్నతల్లి పోవునది. మా యింటికి శక్తిమతి వచ్చునది. అవియన్నియు యెప్పటికిని మఱపురావు.

ముక్తావళి కన్నులనీరు గిఱ్ఱున తిరిగినది. ముక్తావళీదేవి కిప్పుడు యేబది తొమ్మిది సంవత్సరములు మాత్రమే యెనను, తలయంతయు కొమరితపోయిన గాఢవిచారమున ముగ్గుబుట్టవలె నెరసిపోయినది.

హిమ: అమ్మమ్మా, యీ దినమున మన మా శక్తిమతీదేవిగారి యింటికి పోవలెనే. వారి అమ్మాయి నాగబంధునికయు, నేనును చదువుకొంటిమి. శక్తిమతీదేవిగారి భర్త నెరుగుదువా?

ముక్తా: ఆ, ఎరుగ కేమి తల్లీ! ధర్మనందులవారు మహోత్తమ శిల్పి. మా గ్రీసుదేశపు శిల్పములకన్న వీరిశిల్పములం దేదియో విచిత్రత, ఏదియో మహోన్నతి నాకు తోచును.

హిమ : అవి అన్నియు చూడవలెనే.

ముక్తా: తల్లీ! యీ మూడేండ్లనుండియు ఎచ్చటికైన కదలుచుంటిమా మనము?

హిమ: అమ్మమ్మా, మనము వెళ్ళితీరవలెను. నాకు అమ్మజ్ఞాపకము వచ్చి ఈ దినమున అతి బెంగచే బాధపడిపోయినాను. మన మెక్కడి కైనను వెళ్ళకపోయినచో నాకు మతియే పోవును.

ముక్తావళి హృదయమున గజగజలాడి “అలాగునే అమ్మా. అమ్మాయి అమృతలతకు వార్త పంపెదను, మీ తాతగార లిరువురును సంఘా రామము విడిచి రారాయెను. అన్నగారు వినయగుప్తులవారు బౌద్ధ దీక్ష తీసికొనెదరని అందరును చెప్పుకొనుచున్నారు. ఈ దినము సాయంకాలము మనము మువ్వురము బాలనాగిని తీసికొని శక్తిమతీ దేవిగారి యింటికి పోదములే” అన్నది.

30. శిల్పసందర్శనము

హిమబిందు కేలనో భయము వేసినది. ఏమియు తోచదు. అలంకారికురాలగు తారాదత్తను పిలువనంపి తనకున్న మంచివస్తువులను, వస్త్రములను తీయుమన్నది. పాము కుబుసములబోలు సన్నని దుకూలములు చిత్రచిత్రవర్ణములు జెలువొందినవి యామె దూరముగా ద్రోచినది. వలిపెములు సముద్రవీచికాఫేన సదృశములై జిలుగుల తళుకు

అడివి బాపిరాజు రచనలు - 2

. 79 .

హిమబిందు (చారిత్రాత్మక నవల)