పుట:Himabindu by Adivi Bapiraju.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ళనమును కలిగించెడివి. గ్రీకు బాలికలు పురుషవాంఛలు తీర్చు దివ్యసౌందర్య మూర్తులు. పొంకములు తిరిగిన వారి యవయవముల ప్రత్యణువు పురుషస్పర్శ కాంక్షించును. భారతీయ బాలికలు పురుషులను ఉత్తమపథాలకు నడుపుకొని పోవు దేశికలు. ఇట్లు గ్రీకు యువతీ గాఢకాంక్షలు భారతీయాంగానాశేముషీసంపన్నతయు, స్వాతంత్ర్య భావ జనిత గాఢాభిలాషయు ఆమె హృదయ పథముల ప్రతిస్పందనము కలుగ జేయుచునే యున్నవి.

ప్రజాపతిమిత్ర పూర్ణభారతీయాంగన. ముక్తావళి పెంపుడు భారతీయ లలన. అయినను ఆమె యవనస్త్రీయే.

హిమబిందు తనకు తెలియరాని ఆవేదన తన్ను పొదివికొనినప్పుడు చిన్నతనములో తల్లికడకు పర్వెత్తి, ఆమెఒడిలో తలదూర్చి వెక్కివెక్కి ఏడ్చునది. ఆ అతిలోక సుకుమారాంగి తన కొమరిత మూర్ధము పై చేయి నిమురగనె హిమబిందున కారాటము తీరిపోయి ఏదియో దివ్యానందము ముంచి వేయునది.

నే డా బాలిక తల్లికడకు పర్వెత్తినది. తల్లి సువర్ణవిగ్రహము. హిమబిందు ఆ తల్లి వక్షమున మోమును పొదివికొని “అమ్మా! నా కీవేదన ఏమిటే? నాయనగారిని ఓడించి దేవతామూర్తివలె ఆ యువకుడు విజయసింహాసన మధిష్టించియుండ నేను వెఱ్ఱిదానివలె అతనిచుట్టు నాట్యముచేసితిని. అది తప్పా అమ్మా!” అని వాపోయెను.

ఆ బాలిక కన్నుల గిర్రున నీరు తిరిగిపోయినది. మోమెత్తి తల్లి మోమును చూచుచు “నాకిట్లు ఆతనిచూడ యీ విపరీతపుకోర్కెలేమి అమ్మా! ఆతని చూడకపోయిన నేను బ్రతుకలే నను భయము కలుగుచున్నది. అది తప్పు కాదూ? ఏమియో నాయనగారి ఆలోచనల కాతడు అడ్డమువచ్చినాడని నా నమ్మకము. అమ్మా, అతని గురించి ఆనాటి నుండియు నే నాలోచింపని క్షణ మొక్కటియు లేదే! అది ఎంత తప్పు!”

మరల హిమబిందు కన్నులనుండి ముత్యములు స్రవించి, కరిగి పాటలములగు ఆమె కపోలములనుండి దొర్లిపోయినవి.

“నే నేమిచేయవలెనో చెప్పవా అమ్మా?” తల్లి ముఖమును తదేక దీక్షతో చూచు ఆ బాలికకు ఆ విగ్రహము పెదవుల కదిపినట్లు తోచినది.

“నీవు పో తల్లీ, అంతయు శుభము జరుగగలదు” అని తనతల్లి చెప్పినట్లమెకు స్పష్టముగ కాకలీస్వనములు వినబడినట్లయినది.

మరుసటి క్షణమున ఆ బాలిక గంతువైచి లేచి మాతృవిగ్రహమునకు సాష్టాంగనమస్కృతులిడి కలకలనవ్వులు పూలగుత్తులవలె యామె మోమున ప్రత్యక్షముగా నాట్యమాడుచు పూజాగృహమును వీడి, “బాలనాగీ” యని కేకలువేయుచు పర్వెత్తినది.

ఒక్కచిటికెలో బాలనాగి వచ్చి యెదుట నిలిచినది.

“మా అమ్మమ్మ ఎక్కడ నున్నదే?” అని హిమబిందు అడిగినది.

“భోజన మైనప్పటినుండియు వారు విశ్రమించియున్నారు” అని బాలనాగి యుత్తరమిచ్చినది.

హిమబిందు విసవిస తన ముత్తవ గదిలోనికి పోయినది. ఆమె యప్పుడే లేచి మొగము కడుగుకొనుటకు స్నానగృహమునకు చనినది. హిమబిందు బాలనాగి వెంటరా నా గృహంబునకు పోయినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 78.

హిమబిందు (చారిత్రాత్మక నవల)