పుట:Himabindu by Adivi Bapiraju.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భార్య దివంగతురాలైన రెండవసంవత్సరమున అమరనంది, ధర్మనంది ఇరువురు ఇదివరకున్న ఆమె ప్రతిమల విమర్శించి, తమ స్మృతి శక్తిని సహాయముగొని ప్రజాపతి మిత్రను పద్మాసనాసీనగా, ప్రజ్ఞోపరిమితాదేవిగా నిండు బంగారు విగ్రహముగ పోతబోసినారు. విగ్రహము హిమబిందు పూజాగృహమున పూజాపీఠ మలంకరించినది.

హిమబిందుకుమారి దినదినము ఉదయముననే స్నానాదికము లాచరించి సర్వాలంకారయుక్తయే శుభ్రవసనముల ధరించి మాతృవిగ్రహమును పూజసేయును, తన హృదయమంతయు తల్లితో నివేదింపని దినమామెకు లేదు. పూజయంతయు సలిపి, ఒకనా డాబాలిక ఆ స్వర్ణదేవి కడ మోకరించేను. ఆమె రెండుచేతులు తల్లి బంగారు తొడలపైనిడి మోమామె పద్మాసనముపై నుంచెను.

“అమ్మా! పలుక వేమి?”

29. తల్లి అనుమతి

“అమ్మా, నీవు ఎక్కడున్నావు? ఎక్కడనుండి వచ్చితివి. అక్కడికే పోయితివి. నన్ను నీ గర్భమున గంటివి. అంత చిన్నతనములో నన్ను వదలి మాయమైపోతివి.”

ఉత్కృష్టశిల్పరూపమగు ఆ జాంబూనద విగ్రహము హిమబిందు మాటలకు ఏమి ప్రతి వచింపగలదు!

హిమబిందునకు చిన్నతనముననుండియు దూరమున తోచు ఏదియో ఆశ. అది ధనము కాదు, సంపదకాదు, వైభవముకాదు. మహారాణులు కనీ విని యెరుగని నగలామె. మందసముల నున్నవి. మానవమాత్రు డూహింపజాలని విచిత్రవస్తాదికము లామె. పేటికలలో పాముకుబుసములై, పలుచని మబ్బుల మడతలై, పుష్పపుటములై, స్వప్నములై, శ్రీమద్రామాయణ శ్లోకములై జాలువారుచున్నవి. చారుగుపు డాబాలిక ఊహకందని పూవుజాతులు దేశదేశమునుండి సేకరించి క్రీడావనముల పెంచుచున్నాడు. అవి జపాకుసుమజాతులు, ఇవి నీలనదీతరంగడోలార్ధ సహస్రదళకమలములు. ఇవి మల్లికలు, అవి సంపెంగలు. ఇవి శేఫాలికలు, అవి కబంధములు. అక్కడ సూర్యకాంతములు, ఇచ్చట పారసీకమునుండి వచ్చిన గులేబకావళులు. ఇవి సంపూర్ణదాడిమీ పుష్పములు, అవి చీనాదేశమునుండి వచ్చిన అరుణచేరులు. ఇచ్చట కరవీరములు. అవి నాగ లింగములు, ఇవి వకుళములు. ఇవి మాలతీలతలు, అవి మాధవీలతలు.

తన చెలులకు పుష్పవనవాటులు చూపి హిమబిందు పొంగిపోయెడిది. పదునేడేండ్ల మిసిమి వయస్సున నున్న హిమబిందునకు నేడు పుష్పవనవాటులు, నగలు, నాణెములు, ఆటలు, పాటలు ఆనందము సమకూర్చ లేకపోయినవి.

ఒకప్రక్క ఆప్రొదితీదేవి భౌతికవాంఛలు, గాఢకాంక్షలు, ఉడుకు రక్తములు, తీరని కోర్కెలు ఆమెకు వరమిచ్చినది. వేరొకప్రక్క సాధుమూర్తియే చతుర్విధ పురుషార్థ ప్రదాయినియైన మాయాదేవి శాంతమును, శ్రద్ధాభక్తులను అరణమిచ్చినది. ఈ రెండు మహాశక్తులు చిన్ననాటనే ఆమెకు తెలియక ఆమెలో మహత్తరగంభీర సుడిగుండముల జన్మింపజేసినవి. ప్రేమయన నెట్టిదో యెరుగని మొదటిదినాలలో తాను సమవర్తిని ప్రేమించితి ననుకొన్నది. ఆమెకు ప్రేమోదంతములు రహస్య కాంక్షలు అవ్యక్తాందో

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
. 17 .