పుట:Himabindu by Adivi Bapiraju.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజాపతిమిత్రకు యౌవన మంకురించి దేవలోకమునుండిదిగివచ్చు మూర్తివలె నయినది. చదువులో మొదటిబిడ్డ, సంగీతములో ప్రథమ బాలిక, నాట్యములో ఊర్వశి. ఆ పరమసుందరాంగిని జూచి చారుగుప్తుడు ఆమె పాదములమ్రోల తన ప్రాణము, ఆత్మ పూజాపుష్పముల జేసినాడు. కోటీశ్వరుని తనయుడైనను సర్వవిద్యాపారంగతుడై, బలసంపన్నుడై, రసగ్రహణపారీణుడైన చారుగుప్తునే వరించినది ప్రజాపతిమిత్ర.

ప్రజాపతిమిత్ర కాపురమునకు వచ్చినప్పటినుండియు చారుగుప్తుడు ఇతరము సర్వము సంపూర్ణముగ మరచిపోయినాడు.

28. స్వర్ణ ప్రతిమ

ప్రజాపతి కాపురమునకు వచ్చిన రెండేండ్లకు వారిరువురకు హిమబిందు ఉద్భవించినది.

ప్రజాపతిమిత్ర ఆనందముకు మేరలేదు. చారుగుప్తుడు సీతదొరికిన జనక మహారాజుకన్న ఎక్కువ ఆనందము నందినాడు. వారిరువురు ఉమనుగన్న మేనా హిమవంతులకన్న ప్రకాశించిపోయినారు.

కోటీశ్వరుడైన వినయగుప్తుడు శ్రీకాకుళమునుండి, కావేరి పట్టణమునుండి, తామ్రలిప్తినుండి, భరుకచ్ఛమునుండి, సువర్ణద్వీప, బలిద్వీప, యవద్వీప, సింహళద్వీప, రాక్షసద్వీప, మలయద్వీప, నీలద్వీప అను ద్వీపాది ద్వీపానేకములనుండి నారికేళ, ప్రవాళ, మౌక్తిక, శోణరత్న, లవంగ, జాయక, ఘనసార, చంద్రబాలా, కోరంగి మొదలైన వస్తువులను తెప్పించును. బంగారము, వెండి, రాగి, ఇనుము, కత్తులు, కరవాలములు, ఛురికలు, వర్మములు, దర్పణములు, నగలు, నాణెములు, విగ్రహములు మొదలగు వస్తువు లెన్నియో దిగుమతులు చేయుచుండెను. ఆతనికి వందల ఓడలున్నవి. కీర్తిగుప్తుడు సార్థవాహుడు, వినయగుప్తుడు సాయంత్రికుడు. సాయంత్రికులను పోత వణిక్కులనియు నందురు. ఇరువురు వియ్యమందుట సముద్రుని తండ్రియైన వరుణదేవుడు, గంగాదేవి తండ్రియైన హిమవంతుడును వియ్యమందుట యని దేశము లాడికొని ఆనందము నందినవి.

చిన్న మనుమరాలు పుట్టినప్పుడు కీర్తిగుప్తుడు, వినయగుప్తుడు హిమబిందున కెన్ని సుందరక్రీడావస్తువులు సమర్పించినారో, ఎన్నియలంకారములు, ఎన్ని భూషణములు, ఎన్ని వస్త్రాదికములు తెచ్చినారో! హిమబిందు క్రీడామందిరముల నెన్నియో సాలభంజికలు, లక్కబొమ్మలు, దంతపు శిల్పములు, గంధపు ఆటసామానులు, ముత్యపుచిప్పల పెట్టెలు, వివిధరకముల శంఖములు, గవ్వలు, పవడముల చందుగలు, పళ్ళెములు, అమూల్య రత్నములు, శిలలుదొలిచిన బరిణెలు, సింహ, శార్దూల, వ్యాళ, ఖడ్గమృగ, మృగాది జంతువుల చర్మము లున్నవి. పూసల పేర్లు, కోటుల ఫణములు విలువచేయు ఎర్ర ముత్యముల హారములు, నవరత్నహారములు, బంగారునగలు, రత్నఖచితహారములు, కేయూరములు, శిరోభూషణములు, మేఖలలు, మంజీరములు, లోలకములు, కర్ణభూషలు, చీనా దుకూలములు, బాహ్లిక పారశీకాది దేశ రాంకవములు, నీలదేశవల్కలములు లెక్కలేనన్ని ఆమెకై మందిరములు, మందిరములు నింపినారు ఇరువురు తాతలు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 75 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)