పుట:Himabindu by Adivi Bapiraju.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధర్మనంది మహాచైత్యవాదమునకు ముఖ్య శిల్పాచార్యుడు. అతని పవిత్ర హస్తము రచించిన త్రిరత్నములయిన పద్మములు, బోధివృక్షములు, చైత్యములును ప్రజ్ఞా స్వరూపములైన జాతక గాథలును లోక విఖ్యాతి నందినవి.

ఆ సంపూర్ణ జోత్స్నాకాంతిలో సువర్ణశ్రీ తన తండ్రిగారి శిల్ప చాతుర్వమును జూచుచు, ఉప్పొంగిపోవుచు, తన శిల్పపుంబనుల గమనింపుచు, ఆ పనులలో తక్కిన శిష్యుల పనితనముకన్న ఎన్నియోరెట్లు మిన్నయగు పనితనమున్నను, తన తండ్రిగారి పనితో పోల్చిచూచిన, తన పనితనములో ఏదో అపరిణతి యున్నదని యనుకొనెను.

ఈ ఆలోచనలచే మై గుబాళింప, ఆతడు ఆ పవిత్రచైత్యము ఎదుట సాష్టాంగపడి లేచి మోకరించెను. తన జనకుని మహోత్తమ రచనా ప్రజ్ఞ ధారణచేసిన ఒక బాలికా రూపముకడ నాత డధివసించి తన తల్లి శక్తిమతీదేవి పోలికలనందు గుర్తించినాడు. ఈ విచిత్రరహస్యము ఇంతకాల మెట్లుదాగున్నది?

ఆర్యకస్తంభ చూళికా వ్యాజమున దేవీప్రతిమగా తన తండ్రి యౌవనవతియైన తన తల్లి శిల్పచిత్రమును రచించినాడు. త్రిభంగియై కుబేరాక్షీ వృక్షము నానుకొని లతవలె వంగి, ఎడమచేత లేతకొమ్మ విలాసముగ బట్టుకొని, కుడిచేత లీలాపాటలీపుష్పము ధరించి హృదయము లీలగా స్పృశించుచు, జటాశిఖ ధరించి, సర్వాలంకారయై, యా బాలిక తోరణశిఖావాతాయనాంతర్గతాలంకార శిల్పరూపమున విన్యసింపబడి యున్నది.

సుందరీమణులగు లతాంగులకును, శిల్పమునకు నుండు అద్భుత సమయ రహస్యములు సువర్ణశ్రీకుమారున కెన్నడు ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడాతని సర్వశిల్ప శాస్త్రమంత్రము లొక్కసారి పవిత్రగానశ్రుతులై స్పందనమొనర్చినవి. ఆ విగ్రహమును తదేకదీక్షతో గమనించుచు సువర్ణశ్రీ లేత రావి చెట్టువలె నిలుచుండిపోయినాడు. సమున్నత శరీరియైన యా బాలకుడు స్వర్గమునుండి దిగివచ్చిన దేవకుమారునివలెనున్నాడు. ఆతని హృదయములో శిల్పశక్తి ఊర్మికలై, ప్రవాహములై ఉప్పొంగి మహాప్రళయమైనది. ఆతడు సర్వము మరచినాడు. ఆ శక్తి ప్రవాహములు ప్రవహించి, వేరొకపుణ్యభూమి నుండి ప్రవహించి వచ్చిన సురదీర్ఘకానదీమతల్లియైన ప్రేమశక్తితో సంగమమైపోయినవి. ఆ ద్విప్రయాగ మూర్తియగు నొకదేవి యచ్చట దర్శనం బిచ్చినది. మనోహరగంధ మలయ పవనములు సువర్ణుని చుట్టివేసినవి.

ఆ దివ్యమూర్తి నాట్యదేవతవలె ప్రత్యక్షమై, వివిధాంగహార మనోజ్ఞ రేఖా విలాసినియై, సంపూర్ణరాగరంజిత మనోజ్ఞ గీతికాగానాభినయ కంఠియై, విద్యున్మాలినీహార చలిత పీనవక్షయై తోచినది.

ఆ మూర్తి నాట్యము చాలించి ఎదుట నిలిచినది. సువర్ణశ్రీ ఆ స్వప్నసుందరివైపు బలపూర్ణములై, మహానాగములవలె శక్తివంతములై, మనోహర ప్రౌఢరేఖాసమన్వితములైన తన రెండుచేతులు చాచి మోకరించినాడు.

“ఓ శిల్పదేవీ! సకలమనోజ్ఞ భావపరిపూర్ణరూపా! సర్వరాగనర్తిత కల్యబాల! పరీమళ పుష్పాలంకార వైభవోపేత పారిభద్రతరుమూర్తీ! నీవు ఈ వెన్నెలలో నాకు ప్రత్యక్షమైనావా?” అని అస్పష్టవాక్కుల నమస్కరించినాడు.

పులకితానందశిరీషవృక్షమగు నాతని విగ్రహ మా వెన్నెలలో శ్రుతియై మంజుశ్రీ మూర్తివలె తేజరిల్లి పోయినది.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు(చారిత్రాత్మక నవల)
.69.