పుట:Himabindu by Adivi Bapiraju.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థౌల: రెండు దినములలో నొక రథము ఈతని శరీరమును ఈతని పురమునకు గొనిపోగలదు. ఊరిబయట చేత నొక కత్తితో నీతడు పడియుండును. ప్రక్కనే నాకడనున్న పామొకటి రెండు తుండెములై కాలికడ పడియుండును. అతని కాలిమీద పాముకాటు స్పష్టముగ కనబడును.

అక్కడనుండు సభ్యులకు దేహము జలదరించెను.

వికృతహాసముచే బీభత్సమగు తాతగారి మోము చూచుచు చంద్రబాల చటుక్కున వచ్చి యాతని పాదములకడ మోకరించి వానిపై మోముంచి కన్నుల నీరు వెల్లువలు గానిట్లు పలికెను: “తాతయ్యగారూ! ఈ తుచ్ఛుడు నిజముగా మరణించినాడా? నావలననే వీనికి జావు మూడినదా? నేనే వీనిపాలిటి మృత్యువునైతినా?” అని వాపోయెను.

స్థౌలతిష్యుడు విసుగుదలతో నామెను లేవనెత్తెను. ఈమె ఓర్వలేకపోవుట యేమి? ఈ బాలిక తనచేతిలోని - కాదు, విధిచేతులలోని - శస్త్రము. నాశనముచేయుట, నాశనము చేయకపోవుట ఆ పని దీనిది కాదు. చిన్నతనము నుండియు నీమెకు హృదయము నశించునటుల తానొనర్చినాడు. ఈమె సుకుమారాంగములందు, మానసమునందు క్రూరత్వము నింపినాడు. మృత్యువును పూరించినాడు. పసితనమునందు లేగదూడల, హరిణముల ప్రాణములు హరించి ఆటగా కిలకిల నవ్వెడిది.

ఈ బాల కిప్పు డీ జాలి యేల పొడమెను? స్థౌలతిష్యుని భ్రూయుగ్మము దరిచేరినది. ఆతని విశాలఫాలమున దున్నిన భూమియందువలె ముడతలు వేనవేలు జనించినవి. ఈ కన్యకాహృదయమున కింకను క్రూరత్వమే పోసెదగాక యని యాత డాలోచించుకొనెను.

“ఓ విషకన్యా! నీవు అగ్నికీలవు, విషకలికవు, మృత్యుధారవు. నీ దేహము కౌగలించిన పాపి నరకమునకుబోవును. నీవు ఉన్నతకులమున జన్మించిన మహాశక్తివి. ఈశ్వరార్పితవు. పరమపవిత్రవు. ఈ నీచుడునీపై చేయి వైచి కలుషమొనర్చినాడు. మహాగ్నికీలను గౌగిలించినవాడు బ్రతుకునా? ఆవితథమైన విధియెత్తికోలున కడ్డముపడి యీ నిర్భాగ్యుడు హతుడైనాడు. వీని నెవ్వరు రక్షింపగలరు? ఈశ్వరనివేదితమును ముట్టిన యీ కుక్కకై వగవకుము. వీనిపాపమే దీనికి మిత్తియైనది. సదాశివగర్భాలయమున వెలుగు దీపార్చివలే నీవు పరమపవిత్రవు. నీపావిత్య్రము రక్షించు కొనుము.”

చంద్రబాల ఆతని మరణమునుగూర్చి యాలోచించుచు మిన్నకుండెను. సభ్యులు భయము గదురు హృదయములతో తలలూపిరి.

స్టౌలతిష్యులంత “ఈ ముహూర్తమున దోష మున్నది కాన వేరొక్క ముహూర్తము నిర్ణయింపబడును” అనెను. ప్రాయశ్చిత్తార్చన జరిగినది. పారాయణ మొనర్చిరి. దీపారాధన అయినది. నైవేద్యార్పణ జరిగెను. స్థౌలతిష్యులా పుష్పముల విషబాలమూర్ధమున నుంచి గాన మొనర్చెను.

“చండమహానల ఫాలవిలోచన!
కాలకాల! ఖలగర్వవిదారణ!
అండజవాహనమిత్ర! శుభంకర!
హర! హర! హర! హర! యీశ
మహేశ మహేశ మహేశ!”

అడివి బాపిరాజు రచనలు - 2

.67.

హిమబిందు (చారిత్రాత్మక నవల)