పుట:Himabindu by Adivi Bapiraju.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రూపెత్తిన యీ పరమాద్భుతశిల్పాశయము, యీ మనోహర మృత్యువు, యీ సమ్మోహనశాపము, యీ రమణీయాగ్ని కీల, యీ మహోజ్వలవిద్యుజ్జిహ్వ యీ బాలిక!”

స్థౌలతిష్యుడు కంపితహస్తము చాచి “పండితులారా! ఈమె నాముద్దుల మనుమరాలు. నా కుమారున కీమె యొక్కతే సంతానము. నేను నా పుత్రు నెట్లు ప్రేమించియుంటినో, నా ప్రేమకు పాత్రుడై యాతడెట్లు శుశ్రూష చేసెనో అది లోకమున కెరుక.” స్థౌలతిష్యులకు కన్నుల నీరు తిరిగినది. బొటనవ్రేలిచే నాతడు బాష్పముల విదిలించెను. “అట్టి మహాపండితుడు, సుకుమారరత్నము దివంగతుడైనాడు. మహాపతీవ్రత నా కోడలుపతి చిహ్నతో సహగమనము జేసినది. తల్లిదండ్రుల ప్రేముడికి దూరమైన ఈ శిశువు మదేకగతి; ఈ వృద్దుడు తదేకగతి. ఈమెను మనయజ్ఞమునకు ధార పోసితిని. ఈమె దేహ ప్రాణములు, మౌనము అంతయు జగద్ధాత్రి లోక పావని యగు మహాశక్తికి అర్పించినాను. తండ్రి చంద్రబాలయని నామకరణముచేసెను.” స్థాలతిష్యుని కన్ను లంత జాజ్వల్యమానమై “ఈమెను పరమేశ్వరుని కంకిత మిచ్చితిని. నా నిధానమును వైదిక ధార్మాగ్నిలో కల్పితిని. ఈమెయే మన సర్వవాంఛలను దీర్చు కల్పవృక్షము. ఈమెయే ఈ పుణ్యభూమిని పవిత్రమొనరింపజన్మించిన కామధేనువు.”

ఆతని తెల్లని గడ్డము, ఊర్ధ్వశిఖ రచించిన ధవళ జటాజూటము, పండువంటి దేహచ్ఛాయ ఇటునటు ఊగిపోయినవి.

24. శలభము

అంత నందరును జూచుచుండగనే చళుకవిషయపుగోడెవలె బలసియున్న పడుచువాడును, నాగవిషయమున గృధ్రమండలాధిపతియు నగు మలయనాగప్రభువు సోమపానము చేసి మత్తిల్లిన క్రతుకర్తవలె లేచినాడు. కండలు కట్టిన తన రెండుచేతులు ముందుకు చాచి, కెంపెక్కిన చూపులు విషకన్యకమోమున నిలిపి, ఉన్మత్తుడై అగ్నిని కౌగలింపబోవు శలభమువలె, వ్యాఘ్రమును జూచి మృత్యువశమున దద్వివృతాస్యమున నులుకు లేడివలె ఇతరులు అడ్డుపడులోపల ఆ బాలవంక పరుగిడిపోయి యామెను కౌగిలించి యామె పెదవులు ముద్దిడబోయినాడు.

ఆ బాలిక భుజములు రెండును గట్టిగా నదిమిపట్టినాడు. మృదుల వల్లికామ తల్లికవలె నున్న యా విషకన్య యా కర్కశహస్తపీడనమున కోరువ జాలక, ఆతని చుంబనమున కేవగించుకొని తల వెనుకకు వంచినది. ఆమె నిశ్వాసములు భయంకర భుజగిపూత్కారములై మలయనాగుని నాసికారంధ్రములలోనుండి, తెరచియున్న నోటిలోనుండి లోనికి బోయినవి. సభాసదు లింతలో నా దురాచారుని చేతులనుండి బాలికను విడిపించిరి.

మలయనాగుడు ఆ విషవాయువుల పీల్చినలిప్తలో కనులు తిరుగ, నోట నురుగులు గ్రమ్మ చాపచుట్టవలె నేలపై విఱచుకపడెను.

సభ్యులందరు గొల్లుమనిరి. చంద్రబాల క్రోధరూపిణియై రోజుచు ఇటునటు ఊగిపోవుచుండెను. ఆ బాలికకేశపాశము ఊడిపోయి, మేఘములు క్రిందికి దిగునట్లు సువ్వునపడిపోయెను. తప్తజాంబూనదకలశముల వంటి ఆమె వక్షోజములు పైకి ఉబుకుచు తగ్గుచున్నవి.

అడివిబాపిరాజురచనలు-2
హిమబిందు(చారిత్రాత్మక నవల)
.65.