పుట:Himabindu by Adivi Bapiraju.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకడు: అవునుస్వామీ! ఇట్టి మహాపవిత్రకార్యము చేయుటలో కొన్ని కష్ట కార్యములు చేయవలసి వచ్చినను వెనుదీయకూడదు. మనము దురుద్దేశముతో చేయుట లేదుగదా?

చండికుడు: ఇన్ని సంవత్సరములు వేదపారాయణముచేసి, శాస్త్రములు పఠించి, ప్రతిజ్ఞగైకొని యీనాడు నేను వెనుదీయుదునా? చంద్రస్వామిలేని కొరతలేదు. మనము ముఖ్యకార్యము నడుపవలసినదే.

మిగిలినవారందరును “నిజము నిజ” మని చెప్పిరి. అందరును ఆవేశపూర్ణులై యున్నారనియు, తన కార్యమునకు తోడ్పడెదరనియు, నా సభ నడుపు ప్రధానపురుషునకు దోచినంతట నా విషయమునుగూర్చిన సంభాషణమాని “మన మిక్కడనుండి వివిధములగు మార్గముల ధాన్యకటకము చేరవలయును. మహాయోగి, పుణ్యపురుషుడు, స్థాలతిష్యులవారు వారి పని కొనసాగు శుభముహూర్త మేగుదెంచినదనియు, దానిని గమనించుటకు మనమందరము రావలెననియు ముదల పంపినారు. మీరుదప్పనింక నెవ్వరిని తీసికొని రావలదు. రేపు త్రయోదశినాడు శుభముహూర్తము” అని యతడు పల్కెను.

21. పరిత్రాణము

సమదర్శి పోటుమానిసి. చురుకుపాలెక్కువ. వెనుకముందుచూడని సాహసి. తనకిచ్చిన ఆ అక్షౌహిణీసైన్యముగొని పిట్టను వెన్నాడు డేగవలె దుర్గమారణ్యములబడి రివ్వున పోజొచ్చెను. దిగంబరులు, క్రూర సత్వులగు రాక్షసులను ఆరణ్యక జాతివారు (ఇప్పటికిని బస్తరు సంస్థానపు దుర్గమారణ్యములలో నున్నారు. వారిని మేము చూడ గలిగితిమి) ఆ అడవులలో నుండిరి. ఆ మూకల స్నేహముచేసికొని వారికెన్నియో విచిత్ర వస్తువుల కాన్కలిడుచు, వారి మన్ననల గ్రహించుచు, తనజాడ పుళిందులకు తెలియకుండునట్లు కష్టతమములగు మార్గములనే రాక్షసులు చూప నడచిపోవుచు, సమదర్శి రెండు వారములలో మాళవరాజ్యపు సరిహద్దుల చేరునప్పటికి ఒక్క పుళిందుల మూక ఆతని నడ్డగించెను. కాని అర్జునగాండీవవినుర్ముక్త మహాశరమువలె పోవునాతనికి చిన్న సైన్యమొక లెక్కయా! ఆ మూకను చీల్చి చెండాడి ఉజ్జయినికి నాల్గు గోరుతముల దూరమువరకు నాక్రమించియున్న మాళవసైన్యములపై మబ్బులేని పిడుగులవలె దూకెను. కోటలోనున్న వినీతమతికి సమదర్శి సైన్యముల నడుపుకొని వచ్చినాడని వేగు తెలిసినది.

ఉజ్జయినీకోట చాల ముఖ్యమైనది. అది దేవనిర్మితమని ప్రతీతి. శ్రీముఖ శాతవాహనుని తండ్రి, సమదర్శి తండ్రి ప్రియదర్శి సేనాపతిగా ఉజ్జయినీపట్టణమును మహాసంగర మొనర్చి స్వాధీన మొనర్చుకొనెను. అప్పుడు మాళవాధిపతి నీరసముగ నున్నను చాలకాలము అద్భుతముగా కోట కాపాడుకొనగలిగెను. కాని తినుబండారములు నాశమొందుటచే కోట సాతవాహనునకు స్వాధీనమయ్యెను.

సమదర్శి ఆలోచనయొక్కటే. కోటచుట్టునున్న సైన్యములలో చాల భాగము తన్నెదిరించిన ఏ సైన్యమునెగ్గునో భగవంతునికెరుక. పుళిందులు, భోజులు, మగధ సైన్యములు, అవంతిదళములు సహాయము వచ్చుటచే మాళవ వాహిని ఉత్తుంగతరంగ పూర్ణసముద్రమువలె నున్నది. కోటలో వినీతమతికి భోజనాదికములు తగ్గిపోవుచున్నవి. సైనికులు వేనవేలు మడిసినారు. హీనబలులగుచున్నారు. ఆయుధసామగ్రి చాలవరకు నాశనమయినది. సర్వతో భద్రములు, జామదగ్న్యములు, బహుముఖములు,

అడివి బాపిరాజు రచనలు - 2

59.

హిమబిందు (చారిత్రాత్మక నవల)