పుట:Himabindu by Adivi Bapiraju.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిరీటరత్నకాంతులు దశదశల పర్వ దలయాడించును. అతని మొల కొక దుకూలమున్నది. మెడను హారములున్నవి. హస్తమున కంకణములు, బాహువుల గేయూరములు కలవు. అతడు మాటలాడునపుడు మణికుండలము లూగియాడి, భుజములు, మీసములు, గడ్డము కాంతులతో నిండిపోవును. తలత్రిప్పుచు ప్రభువు అందరి మోములను చురచుర చూచును.

శ్రీముఖుడు: నా ఉద్దేశ్యము మనము ప్రథమమున పుళిందుల పైకిపోయి వారికిబుద్ధిచెప్పి, యటువెనుక మాళవముపై దండువిడసిన మంచిదియని. లేనిచో మాళవముపైకి పోవు మనవెనుక నీ పుళిందులు క్రమ్మి అడుగు సాగనీయరు. ప్రప్రథమమున పుళిందులకు బుద్ధిచెప్పితిమా మాళవము సులభసాధ్యమగును.

అచీర్ణుడు: దేవర యాలోచన లెస్సగ నున్నది. రేపటి దినమున సైన్యసంఘములకు, జైత్రయాత్రాసంఘములకు శాసనములు పంపెదను.

సర్వ సైన్యములు నాయత్తమైన వెంటనే శుభముహూర్తము చూచి రణభేరి మ్రోగించెదముగాక!

స్వైత్రుడు: మహారాజా! వినీతమతికి బాసటగా సమదర్శినడుపున ఉజ్జయినికి కొన్ని సైన్యములు పంపుట లగ్గుగదా! త్వరలో సహాయము కావలెనని క్రమేలక వార్తాహరుడు తెచ్చినవార్త. లేనిచో దుర్గము బలహీనమై సమస్తసైన్యముతో నాతడు ఆహుతి కావలసిన ముహూర్తమరు దెంచునేమో? ఆతడు పంపినవార్త దేవరకు విశదము. ఆజ్ఞ!

శ్రీముఖుడు: సమదర్శి స్వతంత్రముగా సైన్యములు నడపగలుగు పాటివాడా? వీరుడు కావచ్చునుగాని తానై సైన్యమును నడపగలవాడా యని.

స్వైత్రుడు: అందునకు నేను పూట. మహామాత్యుల ఉద్దేశ్యము దేవర కనుగొనవచ్చును.

అచీర్ణుడు: సర్వ సేనాధ్యక్షులమాట బాగున్నది. ఉపసైన్యాధ్యక్షు లార్వురిలోను వినీతమతి మాళవమున, కాకుండుకులు ఈ నగరమున, అక్షఘ్నుడు కళింగమున, అఘబలుడు ప్రతిష్ఠానమున, చిత్రకుడు దక్షిణా పథమున, జఘన్వుడు సిద్ధపురమున నుండవలసినవారు. మనకు సమదర్శియో మరొకరో క్రొత్త ఉపసైన్యాధ్యక్షుడు కావలయును. ఆ విషయమును స్వైత్రులవారే చెప్పవలయును. నా వినికిడి సమదర్శియే సేనాపతు లందరిలోను తగినవా డని.

స్వైత్రుడు: రాష్ట్రికులతో యుద్ధమున సమదర్శి ఉపసైన్యాధ్యక్షునికంటే అద్భుతములొనరించినాడు. కాన అతడే దీనికి తగును.

శ్రీముఖుడు: మంచిది. అతని నెప్పుడు పంపెదరు?

ఇంతలో ద్వారముకడనుండి పారిపార్శ్వకుడు “జయము! జయము! మహారాజాధి రాజులకు” అని వక్కాణించెను. అచీర్ణుడు “లోపలికి రా” యనుటయు, నాతడు వచ్చి యందరకు సాష్టాంగనమస్కృతులొనర్చి “జయము! జయము! దేవర యాజ్ఞానుసారము వణిక్సంఘాధ్యక్షులు చారుగుప్తులవా రేగుదెంచినారు” అని మనవి చేసెను. సార్వభౌముడు తలనూపెను. అచీర్ణుడది చూచి “తోడ్కొనిరా” యని యాజ్ఞయిచ్చెను. చారుగుప్తుడు లోనికివచ్చి యందరకు నమస్కారములు చేసి, మహారాజునకు మోకరించి నమస్కార మాచరించెను. అందరును లేచిరి, శ్రీముఖుడు చారుగుప్తుని హస్తముల బట్టి లేవనెత్తి పార్శ్వమున నున్న పీఠముపై నధివ సింపజేసెను.

శ్రీముఖుడు: వర్తకసార్వభౌమా! మాళవాధిపతి యేమి చేసెనో యెరుగుదువుగదా! ఇదివరకు మనచే విజితుడై కప్పము గట్టుచుండెను. తిరుగుబాటు చేయుచున్నాడని వినినంతనే

అడివి బాపిరాజు రచనలు - 2

. 55 .

హిమబిందు (చారిత్రాత్మక నవల)