పుట:Himabindu by Adivi Bapiraju.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చారు : ఉండుతల్లీ! నే నాతనికి సమాధానము చెప్పెదను. అవునయ్యా, నాకు వానియందు మక్కువపోయినది. ఓడిపోయినవని కోపమనుకొందువేమో, అది కాదు. నాకు కొత్త జతలపై మక్కువ. మహాకాండూర నగరమున ఈమధ్య మావాడు ఇంద్రగోపుడు అత్యద్భుతమగు జతను కొనినాడట. కతిపయ దినములలో నవి యిచ్చటకు వచ్చును. ఆర్యావర్తమునగాని, దక్షిణాపథమందు గాని అట్టి పసరము లుండబోవని స్పష్టముగ నాకు తెలియవచ్చినది.

సమ: అయినచో వానిని తప్పక చూడవలెను.

చారు: మాళవముపై కేగు సైన్యమున నీకు ఉపసేనాధ్యక్షత నిచ్చినారు. చక్రవర్తి ఆజ్ఞాపత్రము నీ కందినదా?

సమదర్శి చటుక్కున గంతువేసి లేచి “ఏమిటి మామయ్యా! నిజముగా! నీ కెప్పుడు తెలిసినది?” అని ప్రశ్నించెను.

చారు: ఇప్పుడే. కేరళపక్షులువచ్చి నా చెవిలో చెప్పినవి.

హిమ: (నవ్వుచు) వెఱ్ఱిబావా! బాబయ్యగారు చేసిన పనికి వారితో ఒకరు చెప్పవలెనా?

సమ: మామయ్యా! నీ యనుగ్రహానికి వేయివేల నమస్కారములు. ప్రయాణ మెప్పుడు? ఎన్ని సైన్యములు? అహో! నా కత్యంత సంతోషముగ నున్నది. నా కా శాసన మెప్పుడు చేరును? అయినచో నే నింటికిబోయి ప్రయాణసన్నాహమున నుండెద.

అనుచు నాతడు చారుగుప్తునకు నమస్కరించి, సంతోషస్నేహముల వెనుకనుండి తొంగిచూచు దైన్యముతో హిమబిందు ముఖముదెస గాంచి ఆ బాలికచే ననుజ్ఞాతుడై వెడలిపోయెను. చారుగుప్తు డాతడు పోయినదిక్కున బొమముడితోడి యనాదర దృష్టుల బరపి, పుత్రికవంక జూచి, “అమ్మాయీ! నీ వీతనితో చనువుగా నుండుట తగ్గించివేయుము. శస్త్రజీవనుడు” అని తెలిపెను. “లేదు, బాబయ్యగారూ! చిన్నతనపు స్నేహమున చనవు” అని హిమబిందు నవ్వుచు పలికెను.

19. రహస్యాలోచన

శ్రీముఖసాతవాహనచక్రవర్తి, మహామాత్యుడు అచీర్ణునితో, సర్వ సేనాధ్యక్షుడు స్వైత్రునితో రహస్యాలోచనమందిరమున మంతన ముండెను. శ్రీముఖుడు పొడుగరి. ఆరడుగుల రెండంగుళముల మనిషి. జబ్బపుష్టిగలవాడు. సింగముతో ఆయుధము లేకయే పోరాడునంతటి పోటుమానిసి, పచ్చని దబ్బపండువంటి ఛాయకలవాడు. జుట్టు పొడుగుగ ఉంగరములు చుట్టుకొని వీపుమీదను, భుజములమీదను పడుచుండును. ఒక్కక్కసారి వలిపెములతో ముడులుగా రచియించుకొని, శిరోభూషణములచే అలంకరింపించు కొనును. కన్నులు మధ్యమ ప్రమాణములు కలవి. నాగమణులవలె తళతళలాడుచు, తీక్షణకాంతులచే నెదుటివాని హృదయము చొచ్చిపోగలవు. నాసిక గరుత్మంతుని ముక్కువలె పొడుగై మాటలాడునపుడు వట్రువలు తిరుగు సుందరమగు పెదవులను తొంగితొంగి చూచుచు ఆ వదనమునకు అందమిచ్చును. మీసమును, బవిరిగడ్డమును, విశాలఫాలమును అతని ముఖమునకు వన్నె తెచ్చినవి.

ఆలోచన మెండయినప్పుడు శ్రీముఖుడు అస్థిరుడగును. మొలనున్న కరవాళికా సువర్ణ మేఖలలపై చేతులువేయును. ప్రక్కనున్న విశిత కౌక్షేయకోశముపై దృష్టిసారించును.

అడివి బాపిరాజు రచనలు - 2

• 54 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)