పుట:Himabindu by Adivi Bapiraju.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఆ! మరల మొన్నటి పందెములమాటజ్ఞప్తికి తెచ్చుచున్నావు. నే నా నాడే చెప్పితిని గదా? వాని కేవో శాంబరమంత్రాలు వచ్చియుండవలెను. కానిచో కామందక కులపాలకులకు ఓటమి యేమిటి?”

“అయితే, ఆ మంత్రం నీమీద ప్రయోగించెనా, కామందక కుల పాలకముల మీదనా?”

సమ: “అదుగో, దోషమంతా నాదేనని తేల్చుచున్నావు. రౌతుకొద్దీ గుర్రమనేమాటనిజమేగాని, బిందూ! నేనీవేళకొత్తగా సారథ్యంచేసినానా? ఇదివఱ కెన్నడైనా అపజయ మెఱుగునా నీ బావ?”

సరే నీమాట ఎందుకు కాదనవలెను? ఓటమికి నేనే కారణము. నీవంటి సౌందర్యరాశిమాట కెదురాడడం సరసత్వం కాదు.”

హిమ: సర్వ సైన్యాధ్యక్షులు కావలసిన మా బావగారింతలో ఎంత అల్ప సంతుష్టులైనారు. సరసాగ్రేసరు డనిపించుకోవడంతో తృప్తిపడతావా? బావా?

సమ: బిందూ! నీయెత్తిపొడుపు లెన్నటికీ చాలింపవా? నీకు సంతోషం కూర్చలేని శౌర్యము, పరాక్రమము, సైన్యాధ్యక్షపదవీ నాకెందుకు? చిన్ననాటి నుంచి మనమాడుకొన్న ఆటలు, పాటలు, మనము పెంచుకొన్న నెయ్యము, ఇవన్నీ ఇలా మఱచిపోయి, నాఆశలన్నిటినీ యిలా నట్టేటకలుపుతా వనుకోలేదు.

హిమ: అదుగో! నీకు కోపం వచ్చినది. నా పెంపుడు వృషభము లోడిపోయినవిగదా అనే విచారంకొద్దీ నే నేదో అన్నానుగాని, నీ శౌర్య సాహసాలు నే నెరుగునా బావా? ఆంధ్రసామ్రాజ్యవైరులకు గుండెలో బల్లెమనే కీర్తి ఇంత చిన్నతనంలోనే సంపాదించు కొన్నావు. ఆంధ్రజగతి యావత్తూ నిన్ను చూచి గర్విస్తున్నది. ఆశలన్నీ నీమీద పెట్టుకొని ఉన్న అత్తయ్య నీ వీర వినోదములు విని ఉప్పొంగిపోతున్నది. నువ్వు కాగలవాడవూ, కీర్తికాముడవూ అనియే బంధువులు, స్నేహితులమంతా ఎంతో సంతోషిస్తున్నాము.

సమ: నీకు ఉత్సాహభంగము చేసిన పిమ్మట ఎందరు సంతోషిస్తేనేమి? నా కీర్తి ప్రతిష్టలన్నీ ఏ దేవిపాదాలచెంత కానుక పెట్టుదామనుకొన్నానో ఆ దేవికి నాపట్ల అనుగ్రహంతప్పినది.

హిమ: ఎవరాదేవి, అంత నిష్టురురాలు? ఎన్నడూ చెప్పితివికావు! సమదర్శి శాతవాహనుల ప్రేమను తృణీకరించే కఠినాత్మురాలు, బావా నాతో చెప్పవూ, మా అక్కకానున్న ఆ యదృష్టవతి ఎవరో? నేను వెళ్ళి మందలించి ఆవిడను ప్రసన్నను చేసి వస్తాను. అవునుగాని మా అత్తయ్య ఎఱుగునా, కాబోయే కోడలుగారిని? అవునులే అత్తయ్యా, నువ్వూ తోడు దొంగలు. మాకు తెలియనివ్వరు. కానీలే, మీ రెంతదాచినా పెండ్లినాడైనా చూడకపోముగా. అవునుగాని నువ్వు త్వరగా పెండ్లి చేసుకో బావా! మా అత్తయ్య కోడలికోసం మొగమువాచి ఉంది. మేమంతా నీ పెండ్లి ఎప్పుడెప్పుడని కానుకలతో కనిపెట్టి కొని ఉన్నాము. ఇదిగో, మా నాయనగా రీమధ్య పదియోడలమీద సరుకులు పంపితే రోమకమునుండి రెండు లక్షల సువర్ణాలు వచ్చినవా సరుకుల విలువ క్రింద. ఆ సువర్ణములతో ఇదిగో హారం చేయించాను. మా బావ పెండ్లినాడు మా అక్కగారికి కాను కివ్వవలెనని

అనుచు ఆమె తనచేతికి అందిచ్చిన హారమును సమదర్శి గైకొనెను. తనమాట చొరనీయకుండ నా బాలిక పలికిన పలుకులెల్ల నాతనికి దిగ్భ్రమ కలిగించినవి. ఆమె

అడివి బాపిరాజు రచనలు - 2

• 52 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)