పుట:Himabindu by Adivi Bapiraju.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హృదయము మా అన్న దొంగిలించినట్లు నా అనుమానము ఎక్కువౌచున్నది, అట్లాంటి దొంగతనాలకు రాజసభలో దేశాంతరవాసము విధింపబడుచున్నది. దొంగ అన్నగారూ!”

“ఏమిటి నాగా! నీకు నిజముగా పిచ్చి ఎత్తినది. కులవైద్యులు, ప్రఖ్యాతులు, అపర ధన్వంతరులు, ఆనందులవారు నీకు మందు త్వరగా ప్రారంభించగలరు. సేవకుని పంపి వారిని త్వరగా రమ్మని వార్తనంపవలసి ఉన్నది.”

“మా అన్నగారికే మతిభ్రమణము కలిగినది. ఉత్తమశిల్పి బ్రాహ్మణ వంశజాతుడైన మా అన్న యవనవంశజాతను ప్రేమించుటేమీ?”

“ఓ భగవానుడా! నేను ఎక్కడికైన పారిపోవలసి ఉన్నది!”

“ఓ మాయాదేవీ, ఈ దీనురాలి ఇక్కట్లు తొలగింపవా?”

“చెల్లీ! నీవును, హిమబిందును కలిసి చదువుకొన్నారా?”

“ఆమెయు, నేనును కలిసి చదువుకొన్నాము. ఆమె కోటీశుతనయ”

“ఆమెలో భారతజాతి సుగుణములు, యవనజాతి సుగుణములు మేలు కలయిక పొందినట్లున్నదే!”

“అన్నా! బాలికలలో సామ్రాజ్ఞిని నా అన్న వరించవలె! జయములలో అఖండ విజయము నందవలె. ఆ దినమున నీ చుట్టూ మేమందరమూ నాట్యము సలిపినప్పుడు, హిమబిందు నీవంక అట్లు తదేకదీక్షను చూపులు పరిపినదేమి? చారుగుప్తుని బండిని సమదర్శి శాతవాహన సేనాని తోలినారు.

ఆయన నీవల్ల ఓడిపోయినారు. అందుకని ఆమె కొంచెము కించపడినది కూడ సుమా!”

“ఆమె దేవలోకమునుండి దిగివచ్చిన ఇంద్రాణివలె లేదటే తల్లీ!”

“నీవు ఇంద్రునివలె లేవా ఏమి?”

“సరి! సరి! అదేమి మాటలే?”

ఇంతలో సిద్ధార్థినిక వారిరువురు కూరుచున్న నల్లరాతి బండకడకు పరుగునవచ్చి వగర్చుచు, నవ్వుచు, “అన్నా! వచ్చినది! వచ్చినది!” అని అరచెను.

సువర్ణ: ఎవరు తల్లీ?

సిద్ధార్థినిక: హిమబిందు! హిమబిందే!

నాగబంధునిక: హిమబిందా!హిమబిందు ఎందుకువచ్చునే వెఱ్ఱి తల్లీ!

సిద్ధా: నేను వెఱ్ఱితల్లిని, నీవు తెలివిగల తల్లివి, పోనీలెండి. నా మాట ఎవ్వరును ఎప్పుడును నమ్మరు.

సువర్ణశ్రీ చిన్నచెల్లెలిని దగ్గరకు తీసికొని, “ఓసి బంగారుతల్లీ, అక్క వెండితల్లికాదూ? వెఱ్ఱితల్లి! నీమాటే నిజము! నాగా! నీ కొరకే వచ్చి ఉంటుంది. వెంటనే పో!”

నాగబంధునిక చఱ్ఱున పరువిడినది.

సువర్ణ శ్రీ గుండియలు గతులు తప్పి నడచినవి. ఏమది, ఆ దివ్య బాలిక ఎందుకు వచ్చినది? ఆ దేవీమూర్తి తన ఇంటికే వచ్చినదా? తన ఇల్లు పవిత్రమైనదా? ఓహో ఆమె వచ్చునా? నిజమా!

“అన్నా! హిమబిందు, ఆమె అమ్మమ్మ ముక్తావళీదేవి వచ్చినారు. రాగానే, హిమబిందు అక్కను అడిగినది. నాయనగారి బొమ్మలన్నియు చూడ వచ్చినదట. నన్ను కొంచె మటు తీసికొనిపోయి, “మీ అన్నగారు బొమ్మలు చెక్కునా?” యని యడిగినది.”

అడివి బాపిరాజు రచనలు - 2

47

హిమబిందు (చారిత్రాత్మక నవల)