పుట:Himabindu by Adivi Bapiraju.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆమె కన్నులు! ఏ శిల్పియైన వానిని విన్యసింపగలడా? ఆ కన్నులలో వేయితారకల కాంతులు, ఆమె కనురెప్పలలో పదివేల గగననీలాలు, ఆ బొమలలో వేయి యమునానదీ ప్రవాహధారలు, ఆమె అపాంగములలో లక్ష కల్లోల నర్తనములు, ఆమె భ్రూభంగిమలలో కోటి ఇంద్రధనువు లున్నవి. ఆమె కనీనికలలో మహాపద్మనీల పథము లున్నవి. ఆమె ఎవరు?

తన శిల్పమున నా బాలికమోమును వారెట్లు గ్రహించిరి? తనకు పోలిక లేనట్లే కనబడెనే! ఆమె రూపమును తన అల్పశక్తి కళగట్టింప గలదా? తన కళానైపుణ్యము మంట గలిసెనా? అయోఘనము తప్పి జారి చేతికి రెండుమూడుసార్లు దెబ్బలు తగిలినవి. టంకము చేతపట్టినప్పుడు చేయి వణికిపోయినది. తద్రూపభావనామాత్రమున తనలో నింతటి వివశత్వమునకు గారణమేమి? తన వారితో కూర్చుండి సల్లాపము లాడలేడు, తానొంటిగ నుండలేడు. వేసవిని మిట్ట మధ్యాహ్నమున గాలిలేని సముయమున నిద్రయు పట్టదు. మేల్కొని యేపనియు చేయజాలడు. తన మానస పథమందు గాలివాన లేవైన రాబోవు చున్నావా? నిశ్చల శీతలమందాకినీ తుషారము లెక్కడున్నవి? గంటలకొలది ఇటునటు తిరిగినను తన హృదయమునకు శాంతి కలుగదు. గ్రంథములు చదువుటకు మనస్సుపోదు. పెద్ద చెల్లెలి వీణాగాన మాలకించుచు ఆ స్వనముతో శ్రుతిగలిపి మనోహర గాన మొనరించు దైనందినమగు అలవాటు తనకు నేడు అసహ్యమయినది. ఆతని ఆలోచనలు వాయుద్వంద్వపాతములైపోయినవి.

ఇంతకు ఎవ్వరాబాలిక? చెల్లెలి నడుగ సిగ్గు. తనకు సిగ్గెందుకు? నాగబంధునిక ఏమయిన ననుకొనునా? ఏమనుకొనగలదు!

అతడు కృష్ణ ఒడ్డున కూర్చుండి, మధుమాసవిరహకృశయగు నాధునీ బాలిక నిట్టూర్పుల నాలించుచు, దూరపుకొండల గమనింపుచు, నదీ గర్భమందెల్ల నావరించి యున్న ఇసుకతిన్నెల చూపులేని చూపులతో చూచుచు హిమబిందునే తలపోయుచు కూరుచుండెను.

ఇంతలో నాగబంధునిక వచ్చి యన్నగారి కన్నులు మూసెను. సువర్ణశ్రీ “నాగా చేతులుతీయవే!” యని విసుగుకొనెను.

“అవును! హిమబిందువే లోకమైపోయిన అన్నగారికి చెల్లెలంటే విసుగుకాదా మఱి?”

“ఏమి మాటలవి నాగా! ఇంతట చాలించు.”

“అదుగో! కోపంకూడా వస్తున్న దన్నాయికి. అంత ఉలుకయితే పోనీ మాటాడనులే.”

“అవేమిమాటలే! ఏదోవిసుగున అన్నానే తల్లీ! ఇంతలో కోపమా?”

“నాకు ఎంత కోపముగా ఉన్నదో తెలియునా? నా స్నేహితురాలు, చారుగుప్తులవారి కొమార్త, తల్లిలేని పిల్ల, ముక్తావళీదేవి మనుమరాలు ఆ హిమబిందునుగూర్చి ఇన్నాళ్ళకా మా అన్న తెలిసికొన బ్రయత్నించుట అని. మా అన్నను, ఆ హిమబిందు తలలోనిపూలతో కట్టవలెనని ఉన్నది”

“ముక్తావళీదేవికి అంత స్వచ్ఛదేహం ఉన్నది. ఆమె తెలుగుజాతి ఆడ బిడ్డయేనా చెల్లీ?”

“ముక్తావళీదేవి యవనవంశ జాత అన్నా! ఆమెపోలిక హిమబిందు. హిమబిందు తన అమ్మమ్మకన్న ఎక్కువ స్వచ్ఛమైన శరీరము, అద్భుతమైన అందమును కలది. ఆమె

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
.46.