పుట:Himabindu by Adivi Bapiraju.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు చంద్రస్వామి ముందుకరుదెంచి ఆ భిక్షుకునకు సాష్టాంగ నమస్కార మొనర్చెను. అతని కన్నులలో నీరు సుడిగుండములై దొన దొన జారినవి.

15. శృంగార విభావము

కామవిజయ నాట్యము, కామవిజయనాట్యమే అయినది. సువర్ణశ్రీ ప్రప్రథమమున హిమబిందును ఆ నాట్యమునందు చూచినాడు.

ఎవరీ బాలిక? ఎంత అద్భుతసుందరి! ఈ బాలిక స్వప్నమూర్తియా? నిజమా? ఏ మహాశిల్పి మలచినా డీ విగ్రహమును! ఏ చిత్రకారు డీ రూపరేఖలు దిద్దినాడో?

ఆ ఆలోచన లాతనికి కొంత వ్రీడాభావ మంకురింపజేసినవి. ఆ బాలికను చూడలేడు, చూడక ఉండలేడు. అతనికి తక్కిన ప్రపంచమంతయు మాయమైనది. తనచుట్టును ఆ బాలికలు నృత్యముచేయుచు, పాడుచు, అభినయించుచుండిరి. కాని ఆతని కా ఒక్క బాలికయే నాట్యమాడుచున్నట్లున్నది! ఆమె మనోహర కాదంబినీమాలికవలె క్షణక్షణము సుందరాతి సుందరరూపముల మారుచున్నది. ఆమె పాల్కడలి వాగులవలె భంగికా మనోహర యగుచున్నది. ఆమె వివిధకరణ నిమగ్నయై కుసుమమున మంద మలయానిలయమైనది. ఉధితస్వర రాగకంఠియై ఆ బాల శారదా కరచామీకర విపంచియైనది. ఆమె భుజరేఖలు సువ్వున జారి అంగుళీ రేఖలో వికస్వరమైనవి. బాహుమూల పార్వ శోభారేఖలు వక్షోపరిసమున్నత సుందరాకృతులు తాల్చి, వక్రపతనా వేగమున డిగ్గనురికి మధ్యదేశమున నించుక కాలూని, మలుపులై నితంబచక్రముల సుళ్ళుతిరిగి ప్రవహించి, ప్రవహించి పదరేఖలు మొగ్గలు దొడిగినవి.

ఇది సౌందర్యమా, సౌందర్యమూలకారణమా? ఆతని హృదయ వేగమునకు శ్రుతియైనది హిమబిందు బాలికాచరణసువర్ణమంజీరవేగము. రెండు వేగములు? మహారభటితవృత్తులై లయించినవి.

మహావైభవమున భద్రదంతావళమున సర్వమంగళవాద్యములుమ్రోయ ప్రజానీక సేవితుడై ఊరేగి, ఇంటికి చేరినాడు సువర్ణశ్రీకుమారుడు. కాని సుందరాతిసుందరమూర్తి ఆ బాలికయే ఆతని సమ్ముఖమున ప్రత్యక్షము.

తెల్లవారునప్పటికి ఇంటికి చేరిన సువర్ణశ్రీకుమారునికి శక్తిమతీ దేవియు, నాగబంధునికా సిద్ధార్థినికలు, మహాలియు, పుణ్యాంగనలు, బంధు స్త్రీలు హారతులిచ్చి, దృష్టితీసి, లోనికి తీసికొనిపోయిరి. సువర్ణశ్రీ తలిదండ్రులకు, బందుగులకు పాదాభివందన మాచరించెను. రెండు దినములు గడచినవి. ఆతని పరధ్యానము తల్లిదండ్రులనే యాశ్చర్య పూరితుల చేసినది.

ఎప్పుడును శిల్పగృహమునందో లేక వ్యాయామప్రదేశములందో కాలము గడపువానికి బండిపందెముల గెలుపుచే నిప్పుడీ పరధ్యానమేమి అని ధర్మనంది యనుకొనెను. ధర్మనంది భార్యనుజేరి, “అబ్బాయి అట్లున్నాడేమి? కారణమేమో నీకు తెలిసినదా?” యని పలుకరించెను. శక్తిమతీ దేవి భర్తను కనుంగొని “నాకునూ ఆశ్చర్యము కలిగించుచున్నది. ఏమయియుండును? భోజనము తిన్నగా చేయుటలేదు. ఏవియో రెండు మెతుకులు నోటవేసికొని ఎక్కడెక్కడనో తిరుగుచుండును” అని ప్రత్యుత్తర మిచ్చినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 43 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)