పుట:Himabindu by Adivi Bapiraju.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతియకాని మాకు సార్వభౌమునిపై కుట్రలేల? మహారాజుకు మతదీక్ష యెట్లీయ వలయునను కుట్రతప్ప ఇతరము నేనెరుగ.

“నేనున్న సభయందు శ్రీ రాజకుమార మంజుశ్రీమాట వినబడెనని ఆ సాక్షి తెలుపుచున్నాడు. ఎవరయ్యా శ్రీ రాజకుమార మంజుశ్రీని తస్కరించుకొని పోయినది?” అని యప్పుడు మేమనుకొంటిమి, అంతియ. ఇంకొక సాక్షి శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొనిపోయెనని యనుచున్నప్పుడు తాను వింటిననియు, వానితో నాకు స్నేహమనియు చెప్పినాడు. అది నిజమనుకొండు. అతడు శ్రీ రాజకుమారుని ఎత్తుకొనిపోయినవాడని మాకు తెలియగలదా? నా లేఖలలోగాని, నా నడతయందుగాని స్పష్టముగా శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొనిపోయితినన్న నిర్ధారణయేది? అప్రత్యక్షసాక్ష్యము పనికిరాదని ధర్మశాస్త్రము విధించియుండలేదా? దైవాంశమగు శాతవాహనవంశము వైదికమతము నుద్ధరించుచు చల్లగా మనుగాక” అని చంద్రస్వామి చెదరని కన్నులతో, నవ్వుగదురు ముఖముతో, గంభీరమగు అభినయముతో తన నిర్దోషిత్వము నుపన్యసించెను. ఇంకొక యామము విచారణ జరిగినది.

శిక్ష విధించుటకుముందు ఇరువురు భిక్షులు లేచి “ధర్మచక్ర మీ సభాస్థానమున విలసిల్లుగాక! భగవాన్ మహాశ్రమణకు డిందు ప్రత్యక్షమగుగాక!” అని ప్రాకృతమున శ్లోకములు చదివిరి. ఇరువురు బ్రాహ్మణోత్తము లప్పుడు ముందుకువచ్చి “సభాసదుల హృదయమున సర్వవ్యాపియగు ఆదినారాయణుడు నిండియున్నాడు. కాన వారు ధర్మదేవతాస్వరూపు లగుదురుగాక” యని మంత్రములు చదివిరి.

ప్రాడ్వివాకుడు సభ్యుల యభిప్రాయ మడిగెను. అందరును ఈతడు నిర్దోషి యని నమ్మజాలమని చెప్పిరి. అప్పుడు మహాపండితుడును, సకల మత ధర్మసారము నెరిగినవాడును, సత్యాన్వేషియునగు నా ప్రాడ్వివాకుడు చంద్రస్వామి నుద్దేశించి “ఓ బ్రాహ్మణోత్తమా! నీవు దోషివికావని చెప్పలేము. కాన నీకు ఒక సంవత్సరము పాతాళ గృహవాసము విధించితిని. నేను తప్పభిప్రాయము పడిన ధర్మము నన్ను శిక్షించుగావుత” అనియాతడు లేచెను. సభవారందరు లేచి నిలుచుండిరి.

అంత తేజస్వియు, ధర్మదేవతాస్వరూపుడు నగు ఒక భిక్షుకు డా సభాభవనము ప్రవేశించెను. అందనేకు లాయనకు సాష్టాంగనమస్కార మాచరించిరి. ప్రాడ్వివాకుడు మోకరించి ఆయన పాదములబట్టి కన్నుల నద్దుకొనెను. అంత నాతడు ప్రేమవంతములై, శక్తిసంపన్నములై, తేజోవంతములగు తన దృక్కుల నా ప్రాడ్వివాకునిపై బరపి “నాయనా! ఈ కుమారుడు నిర్దోషి కాన యీతని విడిచివేయు” మని సెలవిచ్చెను. అంతవృద్ధుడగు నా ప్రాడ్వివాకుడు నా నూత్నపురుషునికడ మోకరించియే “తండ్రీ! నేను శిక్ష విధించిన వెనుక తగ్గించుటకు నా కధికారము లేదని తమకు తెలియదా?” యని ప్రశ్నించెను.

ఆ తపస్వి నవ్వి “ఓయి! వెర్రికుమారా! నాకుమాత్రము ధర్మశాస్త్రము తెలియదా? ఇదిగో సార్వభౌముని ఆజ్ఞాపత్రము” అని యొకతాటియాకు పత్రము తన కాషాయాంబరములనుండి తీసి యాతని కిచ్చెను. ప్రాడ్వివాకుడు దానిని కన్నుల నద్దికొని చూచి, లేచి, యిట్లు చదివెను. “ఏ దోషములేదని శోణనగ గ్రామకాపురస్తుడగు చంద్రస్వామిని మేము విడిచిపుచ్చుచున్నాము. ఇయ్యది ప్రాడ్వివాకునకు మా ముదల. స్వహస్త్రనామాంకిత శ్రీ కౌశికీపుత్రశ్రీముఖశాతవాహన మహాశ్రమణ శక 483 పరాభవసం.ర చైతు. సప్తమి” అని యున్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 42 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)