పుట:Himabindu by Adivi Bapiraju.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తి సింహాసనపాదముమ్రోల విజయపీఠిక యమర్పబడినది. సువర్ణశ్రీ కుమారుని నందధివసింపజేసి వసిష్టు డాశీర్వాదముచేసి సువర్ణా క్షతల జల్లుటయు, సార్వభౌముడు, మహారాణియు, రాజబంధువులు, శ్రీకృష్ణసాతవాహన మహారాజు, మంత్రులు, సామంతులు, వేదపండితులు, శ్రమణకులు, ధర్మనందియు నక్షతల జల్లిరి. హిమబిందుకుమారి తన యపాంగవీక్షణముల సువర్ణశ్రీ కుమారుని గాంచెను. ఆమె హృదయము ఏలనో దడదడ కొట్టుకొనెను.

ఇంతలో నొక వైతాళికుడు శంఖమూదెను. అప్పు డా చంద్రరేఖలగు ముగుదలు నాట్యము చాలించి వారి వారి పీఠముల నధివసించిరి. చక్రవర్తి పీఠమునుండి లేచుటయు, మహాసభయంతయు లేచెను. శకటాధ్యక్షుడగు మహశ్రీ సువర్ణశ్రీకుమారుని చేయి పెట్టుకొని సార్వభౌముని కడకు గొనిపోయెను. ఆ బాలకుడు చక్రవర్తికి మోకరించి లేచెను. ఒక సచివుడు ప్రతీహారి అందిచ్చు నవరత్నఖచితమై, బంగారు పనితనముగలిగి, కన్యాకుబ్జ లోహకారకులచే నిర్మింపబడి, పదునేను మడతల ఉక్కురేకు కలిగి, పదునుకడ గాలిలో మాయమై, మొరవవైపు యవగింజ పరిమాణముకలిగి, జవజవలాడు, తళుకు తళుకులాడు, మహానిశితకృపాణమును సార్వభౌముడు దుకూలవస్త్రములతో, తాంబూలములతో బహుమాన మొనర్చెను. ఒక్కసారిగా భేరీ మృదంగాది వాద్యములు భోరుకొల్పబడినవి. మరల నిశ్చలత జనింపగానే, యువరాజు ముందున కేతెంచి సువర్ణ శ్రీకుమారుని మహశ్రీ తన వెనుక తీసి కొనిరా, మందిరముకడకు సూతుడు కొనివచ్చిన యొక కాంభోజాశ్వమును- నల్లనిదానిని, సన్నని ముట్టె కలదానిని, చామరమువంటి తోక గలదానిని కెరటములవంటి మెడజూలు కలదానిని, లేడి కాళ్ళవలె పాదములు కలదానిని పంచకళ్యాణము లున్నదానిని - కళ్లెముబట్టి సువర్ణశ్రీ కుమారుని చేతికందిచ్చెను. మరల దుందుభులు మ్రోగినవి. అప్పుడు మహారాజ్ఞి పరిచారికవచ్చి, యా బాలుని సింహాసనముకడనున్న రాణికడకు గొనిపోయెను. అప్పుడా సాధ్వి “ఇది నీ వివాహమునాడు నీ భార్యకి” మ్మని రత్నమంజూష నొకటి చెలికత్తెచే నిప్పించెను. సమస్తవాద్యములు ధ్వనించినవి.

ఇంతలో చారుగుప్తుడు ముందుకువచ్చి, ధర్మనంది చేయిబట్టి సువర్ణశ్రీ కడకు గొనివచ్చి “ధర్మనందులవారూ! మీ కుమారుడు సర్వతంత్ర స్వతంత్రుడయ్యా! మీ రిట్టిబాలుని కనుటచే ధన్యులు. ఈనాడు విజయమందిన మీ కుమారునకు, నేనును చిన్నకాన్కను సమర్పించుచున్నాను” అనుచు హరగోపుడందిచ్చిన రత్నఖచిత సువర్ణపేటికను మూత తెరచి, సువర్ణశ్రీ హస్తముల నుంచినాడు. అందు దంతపుటము లపై చిత్రించిన పరమపవిత్ర వినయపీఠిక గ్రంథమున్నది. సువర్ణశ్రీ ఆపేటికను కన్నులకు, శిరమునకు నద్దుకొని తన ప్రక్కనున్న రాజసేవకునకందిచ్చెను. ఉత్సవమంతయు నైనవెనుక సార్వభౌముడు మందిరము దిగి దురోన్ముఖుడై దంతావళ మారోహించెను. విజయ సింహుడగు సువర్ణశ్రీ కుమారుని అలంకారభూయిష్టమగు అంబారీ కల యొక మదగజముపై నధివసింపజేసి ధాన్యకటకపురిని ఊరేగింప బయలుదేరదీసిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 340 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)