పుట:Himabindu by Adivi Bapiraju.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమబిందుకుమారి సమవర్తి ఓడిపోయి రెండవవాడుగా మాత్రము వచ్చుట చూచి వెలవెలపోయినది. ఆమె హృదయము క్రుంగిపోయినది.

పెన్నిధి పోగొట్టుకొనినవానివలె క్రుంగిపోయిన తండ్రిని జూచి, యామె కన్నుల నీరు తిరిగెను. ఇంతకు నా నూత్నబాలకు డెవ్వరో తన తండ్రికి దుఃఖకారణుడైనాడు. ఆతడు పిశాచి, రాక్షసుడు. ఆమె ఆ బాలకుని ఇచ్ఛామాత్రమున నాశనముచేయ నూహించినది.

విజయము నందుటకుగాని, ఓడిపోవుటకుగాని ఆ పందెమున ఎద్దులే కారణమయినను, సారథిని కారకునిగా ఎంచి నిందించువారిలో చారుగుప్తుడును చేరినాడు. ఇంతలో అతనికి జ్ఞానోదయమై, తన్ను తానే నిందించుకొనినాడు.

తా నెన్నివేల ఫణములు పెట్టి కొనిననేమి? మహోత్తమ వృషభముల కనుగొనలేక పోయినాడు. ఆ చక్కని గిత్త లెచ్చటివి? ఏ జాతివి? తన గోపాలురకు, గోరక్షకులకు తెలియకుండ నెచ్చట పెరిగినవి? అలాంటి దివ్యవృషభములు లక్షఫణములు మూల్యమిచ్చికొన్ననేమి?

తన స్వప్నములు పటాపంచలైనవి. తాను కౌశికునివలె పన్నిన మొదటి ఎత్తే విచ్ఛిన్నమైనదేమి? ఇది అపశకునమా? ఛా, ఎన్నిసారులు ఓడిపోయి చాణక్యదేవుడు జయమందలేదు? అదిగో తన బంగారు ప్రోవు, దివ్యమూర్తి. హిమబిందు తన్నుజూచి బెంగపెట్టుకొన్నది.

అనుకొనుచు చారుగుప్తుడు కలకల నవ్వుచు, “మనమును విజయునకు కాన్క నీయవలె, హిమబిందూ! హరగోపా! అలంకారికుని, కుయవుని ఇటు రమ్మను!” అని ఆజ్ఞ యిచ్చినాడు.

కుయవానందుడు అద్భుతశిల్పి, అలంకారికుడు. ఆయన మందిరము వెనుక ప్రక్కనుండి ముందునకు వచ్చి, చారుగుప్తునితో రహస్యముగ మాట్లాడి అశ్వము నెక్కిపుర మార్గమున వెడలిపోయెను.

తండ్రిగారి సంతోషము కనుంగొని హిమబిందు హర్షవదనయై నాట్యమున కలంకరించుకొన చక్రవర్తి మందిరము వెనుకనున్న నేపథ్య మందిరమునకు బోయెను.

అచ్చటనున్న యా చకోరాక్షుల, ఆ యిందీవరనేత్రల, ఆ కురంగ లోచనల నడుమ హిమబిందు మహాపద్మనేత్రయై, తారకామధ్యచంద్ర బింబమువలె కాంతులీనుచుండెను. రావి వనములోని వటవృక్షమువలె విలసిల్లెను. మొదట హిమబిందును సమవర్తి చూచుచునే యుండెను. ఆమెవదన మవనతమై సమవర్తి హృదయమును గ్రుంగజేసినది. చేయి పెట్టి కలచివేసినది. తన దురదృష్టముచే మేనమామకు అపజయము కలిగినది కదా యని యాత డనుకొనెను. ఇంతలో చారుగుప్తుడును నవ్వెను. సమవర్తి మనస్సు చకితమై వికారమునందెను. పదునారేండ్ల ఎలప్రాయపు ఆ జవ్వని తన మనస్సంకల్పమునకు, భావనేత్రమునకు ఇదివరకు గోచరము కాని పొంకముతో, అత్యద్భుతసౌందర్య రూపమున ఎదుట ప్రత్యక్షమై నప్పుడు అతనికి మరేమియు కన్పట్టలేదు. నాగస్వరము నూదు పాముల వాని అభినయముల తదేకదీక్షతో చూచు సర్పమువలె నాతడు హిమబిందుగమనము చూపులతో ననుసరించుచుండెను.

అడివి బాపిరాజు రచనలు - 2

33

హిమబిందు (చారిత్రాత్మక నవల)