పుట:Himabindu by Adivi Bapiraju.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ బాలుడు తనకుకలిగిన ఆయాసము నడంచుకొనుచు, చిరునవ్వు మోముతో నీ గడబిడ చూచుచు, తనదూడల పల్కరింపుచు, ప్రేమచే వాని మూపురములు, గంగడోళ్ళు, ముట్టెలు దువ్వుచు, వాని ఆయాసము తీర్చుచు, తనపై దుముకువారివైపు చూచుచుండెను. ఎప్పుడీ నల్వురు కత్తులెత్తుకొని తనమీదికి దూకిరో, అప్పుడా బాలుడుచేతనున్న బంగారు కట్లుకట్టిన, మణులు పొదగిన పెద్ద పులితోలు తాళ్ళుగలిగిన, దంత కశాయుధము పట్టుకొని ముందున్న వాని మోముపై చురుక్కున నంటించెను. “హో” యని యార్చియాతడు కత్తి పారవైచి, కశాఘాతంబుచే రక్తము స్రవించు మోముపై చేతులనుంచుకొని కూలిపోయెను.

ఇంతలో అపరభీమునివలె మహాసత్వుడై పర్వతమువలె ఉన్నతుడై ఆజానుబాహుడై, అమూల్యవస్త్రధారియై, చిరుగంటలు గలిగిన పెద్దగదను ధరించి యొక పురుషుడు రాజాయము కడనుండి పరుగునవచ్చి, సువర్ణశ్రీ కుమారునికడకురికి, పిడుగుమాటలతో “ఎవ్వరీబాలుని స్పృశింప దలంతురో వారు ముందే గదాయుధంబు రుచిచూతు” రని పలికెను.

ధనుర్వేదాచార్యుండును, చండవిక్రముండును, సమస్తవీరహృదయా నందుడును, పవిత్రుడగు సోమదత్తు డానూత్న బాలునకు సహాయియై వచ్చెనని చూడగనే ప్రవాహము వలెవచ్చు ప్రజానీకము పర్వతము అడ్డమురా నాగినట్లయ్యెను. అందరును వెనుకకు తిరిగిరి. అప్పుడు సార్వభౌముని గజ తురగ రథ సైనికులు జవంబున విచ్చేసి మూకల నిటునటు తరిమివేసిరి. సార్వభౌముని కడకు విజయుని గొనిరా రాజాజ్ఞయయ్యెను.

ఈ కోలాహలమంతయు సమవర్తి జూచుచునేయుండెను. జనులు తన్నోడించిన యాబాలునిపై గవిసినప్పుడు సమవర్తిమోము హర్షప్రఫుల్ల మయ్యెను. సోమదత్తుడువచ్చి ఆ కుర్రవానిని ఆపదనుండి రక్షించునప్పుడు సమవర్తి పండ్లు బిగించి సోమదత్తునివైపు చురచుర చూచెను.

ఆ బాలుడు తన్ను రక్షింపవచ్చిన తన గురునకు పాదాభివందన మాచరించి ఆనందాశ్రువులతో నాయన మోము దిలకించెను. సోమదత్తుడు సంతోషమున శిష్యుడగు నా బాలుని బిగవుగిలించుకొని మూర్ధము ముద్దు గొనియెను. వారిద్దరు గజగమనముతో రాజమందిరము సమీపించిరి. ఈలోన ప్రజలకు కోపముతగ్గి ఎట్టి బహుమాన మా బాలుడు బడయునో, సార్వభౌముడేమి చెప్పునో ఆ బాలుడెవరో తెలిసికొన కుతూహలము కలిగి, ఎప్పటియట్లు తమ స్థానముల ఇష్టము చేతనైననేమి, సైనికుల యొత్తిడి చేతనేమి యధివసించిరి. అంతయు నిశ్శబ్దమయ్యెను. చీమ చిటుక్కుమన్న వినిపించునట్లుండెను.

సార్వభౌముని మందిరముకడ అమాత్యులు, సచివులు, సైన్యాధికారులు మొదలగు గొప్ప యుద్యోగులు, సామంతనృపాలురు, ఆంధ్రపండితులు, కవులు, వీరులు-అందరు అధివసించి యుండిరి. శ్రీముఖ సాతవాహనమహారాజు దేవేరితో గద్దెపై నధివసించి యుండెను. రాజసింహాసనము కుడిప్రక్కగా యువరాజాసనముపై చక్రవర్తి పెద్ద కుమారుడగు శ్రీకృష్ణసాతవాహనుడును, ఆ ప్రక్కపీఠికపై శ్రీముఖుని తమ్ముడగు సుధన్వ సాతవాహనుడును కూర్చుండిరి. వెనుక పరిచారికలతో అంతపుర స్త్రీలోకము మణిమయ స్వర్ణపీఠముల ఉపవిష్టమైయుండెను.

సోమదత్తు తనశిష్యుని రాజుమ్రోలకుం గొనిపోయినాడు. ఆ బాలకుడు సార్వభౌమునకు సాష్టాంగప్రణామ మాచరించి, యాతనిచే ననుజ్ఞాతుడై లేచి నిలువబడెను,

అడివి బాపిరాజు రచనలు - 2

• 29 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)