పుట:Himabindu by Adivi Bapiraju.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ఆలోచన సమవర్తికి వేయి ఏనుగుల బలము నిచ్చినది. క్రుంగిపోయిన మనుష్యుడు ఒక్కుమ్మడిలేచి కామందక, కులపాలకలను ఎలుగెత్తి పిలుచుచు, “ఇదిగో గమ్యస్థానము ఒక్కఅడుగు, వెనుదీయకండి, పౌరుషము నిలబెట్టుడు!” అని అరచినాడు. ఆ ఉత్తమ బలీవర్దములును తమ శక్తికి మించిన బలమును తెచ్చుకొని పది ధనువులురికినవి.

చారుగుప్తుడు, సమవర్తి మోమును చూచినాడు. ఆతని ఆలోచనా పథము తనకును సువ్యక్తమై తోచుటతోడనే చిరునవ్వున ఆతనిమోము ప్రఫుల్లమైనది.

హిమబిందు తండ్రివదనమును, తమ శకటమును, వెనుకవచ్చు ఆ ఆంధ్ర యువకుని శకటమును, ఆ విచిత్రంపు కోడెలను, ఆ వెనుకబండ్లను ఆలోచనారహితయై, అదటువహించిన హృదయముతో పరిశీలించుచుండెను. వ్యాకుల మేఘాచ్ఛాదితమైన జనకుని వదనము ఇంతలో నిర్మలమై హాసయుక్తమగుట కనుంగొని, యామె ధైర్యమువహించి, యా నూత్నబాలకునివైపు అపహాసము పరపినది.

ఇంక నూటయిరువది ధనువుల దూరమున మాత్రమే గమ్యస్థానమున్నది. అప్పుడే ప్రజలు విజయ మెట్లయినను సమవర్తిదే యని కేకలు వేయుచుండిరి.

ఇంతలో దావానలాంతరాళమునుండి జనించి శిఖల నన్నింటిమీరి గుప్పున దుముకుజ్వాల సామ్రాజ్ఞివలె, అనేక వాయుసమీకరణోద్భవమై మహాపవనము లన్నింటి దాటి విసవిసబోవు సుడిగాలిరీతి, పూర్వాదిసమీపమున సంభవించి చదలుదాక లేచి అమితవేగమున తరలి తరలి సాధారణ కల్లోలములపై దూకివచ్చు ఉత్తుంగకల్లోలము విధాన, సునాయాసముగ వెనుక వచ్చు నా కుమారుని ఎద్దుబండి సమవర్తి శకటమును దాటి ముందునకు గడిచిపోయినది. ఆ సమయమున నా ప్రఖ్యాతవీరుడు రౌద్రమూర్తియై, గాఢక్రోధమున ఎట్లయిన తన విరోధి బండిని నిలుపు దురుద్దేశమున విడిగానున్న యొక పగ్గపుత్రాడు చటుక్కున అత్యంత నిపుణముగ తన యెదిరివాని యెద్దుల మెడలమీదికి విసరెను. అది చూచి అంద రొక్కసారి హాహాకారముల సలిపిరి. కాని మగటిమి గల ఆ కుర్ర పోటీదారుడు తన చబుకు చురుక్కున పేలించి సమవర్తి చేతిపై మేరుమువలె, బాణమువలె, నాటించి పగ్గము హస్తమునుండి సడలిపోవునట్లొనర్చెను.

సమవర్తిచేయి పట్టువీడిన పగ్గముతాడీడ్చుకొనుచునే ఆ బాలకుని బండి గమ్య స్థానమునకుబోయి నిలిచెను. ఆ గిత్తలు వగర్చుచు ముట్టెలు భూమి నాన్చి, నాల్కలుజూచి, డొక్కలెగురవేయుచు నిలిచియున్నవి.

ఇరువది ధనువులవెన్క సమవర్తి వచ్చెను. శివస్వాతియు, కాళింగుడగు మల్లినాథుడును మూడవవారుగా వచ్చిరి.

ఒక్కుమ్మడి ప్రజలందరు “ఇదిమాయ! తంత్రము! ఇంద్రజాలము! వీడు బ్రాహ్మణ మాంత్రికుడు! వీనిపట్టుడు! కొట్టుడు! చీల్చివేయుడు!” అని కేకలువేయుచు దగ్గరనున్న ఆయుధముల సేకరించి హుమ్మని విజయలక్ష్మీ ధవుడగు నా బాలకునికడ కురికిరి. అచ్చటనున్న రక్షకభటులు ఇట్టిరంగ ముద్భవిల్లునని కలనైన తలచియుండకపోవుటచే, ఆ మూకల నాపుచేయలేకపోయిరి. చక్రవర్తి అంగరక్షకులు కొందరు తమ గుఱ్ఱముల నా విజయునికడకు బరువెత్తించి ఆతని చుట్టును శూలముల జళిపించుచు నిలిచిరి. వారి నెట్లు తప్పించుకొనిరో నల్వురైదుగురు వీరులు సువర్ణశ్రీ బండిని కత్తులెత్తుకొని సమీపించిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 28 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)