పుట:Himabindu by Adivi Bapiraju.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంక విజయలక్ష్మీ ఆసీనయైయున్న తావు అర్ధగోరుతదూరము మాత్రమున్నది. తన్ను వెన్నంటివచ్చు పెనుభూతపు పిన్నవాని పిప్పిచేయవలేనని సమవర్తి తలపోసెను. అతని కన్నులయందు క్రోధము ఫాలాక్షుని మూడవచూపై, ఆ సుందర ముఖమును వికృత మొనర్చినది. అతని ముక్కుపుటములు కామందక కులపాలకుల ముక్కుపుటముల వలె విస్త్రతములైనవి. అతని పసరముల ముక్కులనుండి రక్తపంబొట్టులు తొలకరి సతుంపరులవలే చెదరిపోవుచుండెను.

చారుగుప్తుడు వంగిపోయి తనపీఠము గట్టిగా పట్టుకొని గృధ్రపుదృక్కుల పరుపుచు పందెకాండ్రవైపు చూచుచుండెను. ఆతడి పెదవులు వణకుచుండినవి. అస్పష్టమై ఏవియో మాటలు పైకి వెలువడుచున్నవి. మొదటినుండియు తన వృషభములు తప్పక నెగ్గితీరునని యాత డనుకొన్నాడు. ఆ సందడిలో నా కొత్తబాలుని బండిదూడల కనుగొన్నవారు లేనేలేరు. మొదటిసారి వెళ్ళివచ్చి, మరలివెళ్ళువరకు ఎవ్వరును ఆ యువకునివైపే కనుగొనలేదు. ఇప్పుడాతడు చారుగుప్తునకు ఎక్కడనుండియో అవతరించిన విఘ్నరాక్షసునివలె తోచినాడు. ఆ బాలుడు తనకును, తన కోర్కెలకును ఎడబాటుమంత్రమైనాడని చారుగుప్తుని గుండెయందు గుభిల్లని ఆలోచన కలిగినది. ఒక్కసారి లేచి సునాయాసముగ పరుగిడివచ్చు నా కొత్తబండిగిత్తల కూల్పవలెనని యాతనికి వెర్రియాలోచన పుట్టినది.

ప్రజలందరు చెప్పగారాని ఆలోచనాభావమున తన విజయనాదములు మానివేసినారు. ఒకసారి వాన వెలిసినట్లు, నిమ్మకు నీరువోసినట్లు హృదయభీకరమగు నిశ్శబ్దత నింగి నావరించినది. అందరును చారుగుప్తుని మందిరమువైపు చూచినారు. మరల పరుగిడు పందెకాండ్ల పరికించినారు.

ఇంక పావుగోరుతమున్నది. సమవర్తి “కా-మం-ద-క! కుల-పాలక!న-డు-డు!” అని వగర్చుచుండెను. వజ్రతుల్యమగు నా శూరుని శరీరము వణకినది. కామందక కులపాలకులు ప్రజలోకమునకు విస్మయము కలుగునట్లు ఆతని పలుకుల నాలకించగనే మహాజవమున అరపావుగోరుతము కనుమూతలో గడచిపోయినవి. కాని పాడునీడవలె యా కుర్రవాని బండి ఆతని బండిని వెన్నంటియే వచ్చినది. ప్రథమమున జనులు “కామందక విజయ! కులపాలక విజయ!” అని యరచినారు. ఉత్తరక్షణముననే వెన్నంటివచ్చినయా పిల్లవాని చూచిరి. వారందరి హృదయములు నాతనిపట్ల కోపముచే క్రూరములైనవి.

10. విజయలక్ష్మీధవుడు

ఇంకను కొన్ని ధనువులు గడచినవి. సమవర్తికి తన్ను వెన్నంటు పిశాచరూపుని బండి ఇంకను కూడనున్నదనే తోచినది. ఇంతలో మెరుమువలె ఆతనికి ఒక్కసంగతి గోచరించినది. ఆతని ముఖము ప్రఫుల్లమయినది. ఆతని పెదవులపై మబ్బులు కమ్మినరాత్రి మబ్బులమాటునుండి తొంగిచూచు చంద్రరేఖవలె చిరునవ్వు కలకలలాడినది. గుండెలపైనుండి పెద్దబరువు తీసివేసినట్లయినది. కొన్ని పసరములు మంచి పరుగుగలగిత్త లైనను, తమంతట తాము దారిని పరుగిడలేవు. ఏ బండియైనను ముందుండిన తాము వెనుక నడువగలవు. ఆ ముందుబండి ఎంత వేగవంతమైన అంతవేగమున ఆ విచిత్రజాతి వృషభములు పరుగిడగలవు. అంతియ.

అడివి బాపిరాజు రచనలు - 2

• 27 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)