పుట:Himabindu by Adivi Bapiraju.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రెండవసారి మిగిలిన శకటములన్నియు తిరిగి ముందుకు పోవుచున్నవి. చెమటలు నిండ, నాల్కలు జాపుచు, నురగలు గ్రక్కుచు, నల్లగ్రుడ్డులు క్రిందికి తిరిగిపోవ, ముట్టెల క్రిందికి దించి ఎద్దులన్నియు పరుగిడిపోవుచున్నవి.

బండ్లన్నియు తిరిగి రెండవమార్గమున నర్ధచక్రాకార ప్రదేశమునకు వచ్చుసరికి, కరూరవుని రెండుగిత్తలు గరుడము, హనుమంతము అనునవి ఫెళ్ళున విరుచుకొని పడిపోయినవి. రథము పడిపోక ఆగిపోయినది. కరూరవునకు కొంచెము గాయములు తగిలినవి.

సుశర్మకాణ్వాయనుని ప్రియసూతుడగు కరూరవుడు విషాదము నొందుట మగథప్రజానీకము ఎన్నుకొని పంపిన కాత్యాయనునకు సంతోషమయ్యెను. ఇరువురును సుశర్మకు ప్రియులే. కాని వారికి అంతఃకలహములున్నవి. కాత్యాయను డిదివరకే సిగ్గునంది వెనుకకు పోవలసివచ్చెను. కరూరవుడు తనతోడివాడగుట కాతడు ప్రార్థించిన క్షుద్ర దేవతలు అతని కోర్కెనెరవేర్చినారు.

వృషభములన్నియు నలసిపోయినవి. అన్నిటికి వెనుకవచ్చుసువర్ణశ్రీగిత్తలు అలయిక లేక సునాయాసముగ తేలివచ్చుచున్నట్లునన్నవి. పావుగోరుతదూరము ఇట్లు పరుగిడి వచ్చిన పిమ్మట సమవర్తి తన చబుకు తీసికొని కామందక కులపాలకుల వీపులపై చురుక్కున నంటించెను. ఆ యుత్తమ బలీవర్దనములు తమ బలమంతయు చూపి కాళింగుని బండి దాటివేసినవి. కాళింగుడంత ధైర్యవిహీనుడై యొక్క పెద్ద నిట్టూర్పుబుచ్చి తన యెద్దులనుగూడ వడివడిగా తోల యత్నించెను. కానీ యవి యంత కన్న, నంతకన్న నీరసించి, వెనుకవచ్చు సువర్ణశ్రీ శకటముతో కలిసికొనెను.

ఆ యువకు డంత చిరునవ్వు నవ్వినాడు. ఆతని బండి వేగము సమవర్తి బండిని వెన్నంటిపోయినది. ప్రజలందరు గొల్లున నొక్కసారిలేచి “సమవర్తీ విజయ! సమవర్తీ విజయ!” అని గొంతులు బొంగురుపోవ నరచుచుండిరి. సమవర్తి వెనుకకు చూడవీలులేదు. ఒక్కసారి వెనుకకు చూచిన, అలసట చెందియు పౌరుషము చూపుచున్న ఆ విఖ్యాత వృషభములు తప్పక కూలిపోవును. కాని పందెకాని సూక్ష్మబుద్ధి, పాముచెవుల వంటిది. తనకు కొంచెమయిన ఎడములేక ఒక డతిసునాయాసముగ దూడల తోలుకొని వచ్చుచున్నాడని సమవర్తి తెలిసికొనెను. పందెము మొదటి నుండియు ఆతడా కొత్తపిల్లవాని గిత్తల చూచినాడు. పసరముల సంగతి బాగుగా తెలిసిన సమవర్తి గుండెలా లేళ్ళవంటి గున్నల చూడగానే నదటునొందినవి. కామందక కులపాలకుల అవయవముల పొంకము వానికి లేదు. కమ్మెచ్చులు కట్టి దిమ్మచెక్కలవలె వట్రువులైయుండి కైలాసగిరి శృంగములకు మూపురములుగల తన బలీవర్దముల ముందు ఆ కొత్తగిత్త లేమి చేయగలవు? కొమ్ములింకను వచ్చీరానట్లున్నవి. తన కోడెలకు, శంకరశూలవామదక్షిణపు మొనలవలె కొమ్ములు మెరయుచున్నవి. తన వృషభరాజములేడ, ఈ చిన్నగిత్తలేడ? అని సమాధానపడెను.

మొదటనుండియు సమవర్తి ఆ వచ్చిన నలుబదిబండ్ల ఎద్దులను చూచి పెదవి విరిచికొనెను. కలకలలాడు కాటుక కన్నులతో, మామిడిపిందెల బోలు నాసికా రంధ్రములతో గంభీరములై, శ్రీవక్షములగు ముట్టెలతో, వెలిపట్టు వస్త్రపు మడతలవలె నున్న గంగడోళ్ళతో, మెరుముల వలె, అస్త్రములవలె, సన్నమై మహావేగవంతములై కన్పట్టు కాళ్ళతో ఆ యువకుని గిత్తలు మాత్రము సమవర్తిని వికలుని చేసినవి.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 26 •