పుట:Himabindu by Adivi Bapiraju.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందిరములు వారి వారి గౌరవముల ననుసరించి వెలుగుచున్నవి. సార్వభౌముని మందిరమునకు కుడిప్రక్కగా, అన్ని మందిరముల తుద సామాన్యజనము చూచుటకు తగిన పెద్ద పందిరియొక్కటి తగు అలంకారములతో నిర్మాణమొనర్చిరి.

రాజమందిరము ఎడమప్రక్కగా మూడు మందిరములావల చారుగుప్తుని మందిరము సూర్యకాంతమణివలె నా ప్రదేశమును వెలిగించుచు ఆ వచ్చిన లక్షలకొలది ప్రజల చూపుల నాకర్షించుచుండెను. మూడేండ్లనుండి వెలవెల పోవుచున్న ఆ మందిరము నేడు పూర్ణాలంకార మనోహరమై సుధర్మను పరిహరించుచున్నది. “రాజమందిరమునకు జోడగునది, ఆ మందిర మొక్కటియే” యని ప్రజ లొకరి నొకరు చూచి చెప్పుకొనిరి.

“పదునొకండవ ముహూర్తము మ్రోగించినారు. సార్వభౌముడు వచ్చువేళ అయినది” అని మహశ్రీచండకేతునితో ననియెను. వారిరువురు గుఱ్ఱముల పై నధివసించి రంగస్థలమున నిటు నటు తిరుగుచుండిరి. అంత చండకేతుడు పురమార్గమువంక చేయి నడ్డమునుండి చూచుచు “అదిగో సార్వభౌములు వచ్చుచున్నారు” అని అరచెను.

8. శకటచోదక పరీక్ష

మహాశ్రీ: ఆ వచ్చునది సార్వభౌములుకారు. ఎవరు చెప్పుమా అంతవైభవమున వచ్చుచున్నది?

చండకేతుడు: ఆర్యా! తెలిసినది, తెలిసినది! రత్నకలశధ్వజము! ఆర్యచారు గుప్తులవారు, కోటీశ్వరుల వైభవము ఒక్కొక్కప్పుడు భూమీశుల సంపదను మించిపోవును కదా!

మహాశ్రీ: అవునయ్యా! చారుగుప్తుడు సకల భారతవణిక్సార్వ భౌముడు. ఆయన ఎన్నికోట్లకు నాగదేవుల కాపుంచినాడో! ఎన్నిమందసముల రత్నరాసులున్నవో! వివిధదేశ సువర్ణము లెన్ని మందిరముల లెక్కకురాక, ప్రోవులుపడియున్నవో!

చండకేతుడు: మూడేండ్లనుండి చెన్నుదరగియున్న ఆ వర్తక చక్రవర్తి మండపము ఎంత పరమాద్భుతముగ నలంకరించినారు! ఏమి విశేషము స్వామీ?

మహాశ్రీ: విచార మెంతకాలము మానవునకు! ఆతని భార్య చనిపోయి మూడేండ్లయినది. ఇప్పుడు కొమరిత పదునారేండ్ల వయసునందినది. ఆంధ్రయోషా రత్నములలో ఆ బాలిక కౌస్తుభమే.

చండకేతుడు: ఆమె యందము తనివితీరని వేడుకతో చెప్పుకొందురు. అంత అందగత్తయా ఆర్యా?

మహాశ్రీ: ఓయి అజ్ఞానీ, అందగత్తె అనుమాటను కృష్ణానదీ గర్భమున పడద్రోయుము. ఆమె అపరాజితాదేవి. ఆమె ప్రజ్ఞాపరిమిత. ఆమె శ్వేతతార! ఆమె అనంత సౌందర్యభావోజ్వలమూర్తి!

చండకేతు: ఆర్యులు కవులగుచున్నారు.

మహాశ్రీ: దివ్యసౌందర్యాభిముఖుడగువాడు మొరకుడైనను మహాకవికాడా చండకేతూ?

చండకేతు: మీ వర్ణన విను నాకే కవిత్వము గంగోత్తరస్వరూప మందాకినీ ప్రస్రవణమై వచ్చుచున్నది, శకటాధ్యక్షులవారూ!

ఇంతలో చారుగుప్తుని రథము పరివారపరివేష్టితమై, ఆశ్విక గజవీర సంరక్షితమై, భేరీ మృదంగ శంఖ కాహళ వాద్యములు చెలగ మహాఖేలనాస్థలము దరిసినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 22 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)