పుట:Himabindu by Adivi Bapiraju.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కురు, పాంచాల, సాల్వ, మద్ర, శూరసేన, మగథ, మాళవ, కుంతల, పాండ్య, చోళ, కాంభోజ, గాంధార, కామరూప, ఘూర్జర, త్రికళింగ, వంగ, లిచ్ఛవాది దేశముల కన్నింటికిని; సువర్ణ, యవ, బలి, పూర్వకాంభోజ, సింహళాది ద్వీపములకును, యవన, బాహ్లిక, తురుష్క పారశీక, రోమక, నీలకా, త్రివిష్టప, చీనాది లాతివిలాతులకును సందేశ గ్రాహకులు ఆహ్వానముల గొనిపోదురు.

ఆ యా దేశములనుండి వీరులు, పండితులు, రసజ్ఞులు, రసస్రష్టలు, ప్రభువులు ఈ యుత్సవముల పాల్గొని యానందతరంగడోలికల నూగిపోవుటకు యాత్రలుసాగి యరుదెంతురు.

వృషభశకట పరీక్షకు ఘనదారువినిర్మితరథములకు పూన్చిన కైలాసశిఖర సదృశములగు గిత్తలపూన్చి జయాభిలాషులై దేశదేశముల నుండి వీరు లరుదెంతురు.

మగథనుండి సుశర్మకాణ్వాయన చక్రవర్తి కాత్యాయనుని పంపినాడు. ఉజ్జయిని నుండి మహారధియగు పహ్లవుడు వచ్చినాడు. సౌరాష్ట్రమునుండి పొట్టివియు, బలము కలవియు, లేళ్ళవలె చురుకు గలిగిన పసరముల వివిధ వర్ణాలంకృతమగు రథమునకు పూన్చి జీవనప్రభువీరుడు వచ్చినాడు. నిడుపాటి కొమ్ములు కలిగి వాలుకన్నుల బెదరుచూపు చూచుచు, శ్రమయనునది యెరుగని నల్లగిత్తల గట్టుకొని దక్షిణమునుండి వీరత్తుణి వచ్చినాడు. ఆ రోజున నలుబదిమూడు దేశములు పందెమునకు తమతమ రధికులను పంపినవి.

తెలుగురౌతులు పదునేనుగురు పందెమునకువచ్చిరి. సమవర్తి మేనమామ బండినడుపుటకు నిశ్చయింపబడినది. శిల్పికుమారుడగు సువర్ణశ్రీ కూడ పరీక్షకై పేరిచ్చెను. పట్టణమంతయు కోలాహలముగా నున్నది.

సమవర్తి జయముగాంచునని అందరికీ దెలియును. పట్టణ ప్రజా సమూహమునకు సమవర్తియనిన ప్రేముడి యెక్కువ. లాతిదేశములకు బోయి యచ్చట జరిగిన ప్రదర్శనముల విజయమొంది ఆంధ్రగౌరవము నిలిపినది సమవర్తియేగదా! ఆతడు నడపజాలని రథములేదు, ఎక్కడ్రాలని గుఱ్ఱమునులేదు. ఆతడు చెప్పిన వినని బలీవర్ద మున్నదా?

మహాభేలనాస్థలమంతయు నలంకరించినారు. ఆంధ్రవైభవమంతయు నచట చిత్రితమయ్యెను. చిత్రవర్ణవస్త్రాలంకృతమై, వివిధాకృతమగు ప్రజ భూమి పై వాలిన మహేంద్రచాపముల తలపించెను. ఉత్తరాంధ్రదేశపు సన్నని దుకూలములు చిరుమబ్బుల వలె గాలికి తేలిపోవుచున్నవి. ఆంధ్రదేశమునకు వజ్రభూమి యని పేరు. ఆంధ్రులు రత్నాలరాజులు. స్త్రీలును, పురుషులును ఇప్పుడు మన మగవారివలె ఒక్క అందమగు వస్త్రమును పాదములవరకు రాకటి వస్త్రములు గట్టుకొందురు. ఒక వస్త్రము పైన గప్పుకొందురు. వలిపెముల కొందరు తలచీరలుగా ధరించి యుండిరి. కాళ్ళకు బంగారు కడియములు చేతులకు కంకణములు, మెడలో వివిధములగు హారములుండును. మొలనూళ్ళు ధరించిన యువతులచే నా ప్రదేశము మెరుగు లీనుచున్నది. అనేకులు రాజవంశమువారు తలపై వివిధరూపముల రత్నములు, ముత్యాలహారములు పొదిగిన కిరీటములు ధరించియుండిరి.

ప్రేక్షకస్థలమధ్యమున రాజమందిరమున్నది, అనేక దంత హేమగంథాసనములు అందమర్చిరి. మధ్యమున సార్వభౌముని సింహాసనమును, దానిం జేరియే రాణుల పీఠములును గలవు. ఆ మందిరమున కీవలావల మంత్రుల, దండనాయకుల, సేనాధిపతుల

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 21 •