పుట:Himabindu by Adivi Bapiraju.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అచ్చట నొక శుభముహూర్తమున నాగబంధునికా సమదర్శులకు రాజ ప్రతినిధి మహారాజ పట్టాభిషేకమహోత్సవము జరిగెను.

సమదర్శి సమదర్శియే! సమదర్శి సమవర్తియే. నాగబంధునికయు భర్తను ప్రోత్సహించి, ఆంధ్ర నౌకలపై దూరదేశములకు ప్రయాణము చేయుచు, ఆంధ్ర శిల్పము, నాగరికత వెదజల్లించుచుండెను.

ఓడదొంగలు విజృంభింపకుండ వర్తకము సర్వతోముఖముగ వృద్ధినంద సమదర్శి రాజ్యపాలన చేయుచుండెను.

నాగబంధునికాదేవి మాట సమదర్శికి చక్రవర్తిశాసనము. ఇరువురు సమముగ యుద్ధములకు బోదురు. ఇరువురు సమముగ సభయం దధివసించి తీర్పుల నిత్తురు. ఇరువురు ఆలోచనామందిరమున చంద్రస్వామి మొదలగు మంత్రులతో రాజ్యవ్యవహారము లాలోచింతురు.

నాగబంధునిక గర్భము ధరించియు తల్లితండ్రులకడకు పురిటికి వెడలి పోవ నిరాకరించినది. అమృతలతాదేవి కోడలిని చూచి తనయంత యదృష్టవంతురాలు లేదని పొంగిపోవుచుండునది. నాగబంధునిక పురిటికి శక్తిమతీదేవియు, సిద్ధార్థినికయు, ధర్మనందియు విచ్చేసిరి.

అక్కకు పుట్టిన బంగారుశిశువును చెల్లెలు వదలునది కాదు. శిశువునకు ఏడునెలలు వచ్చువరకు ధర్మనంది కుటుంబముతో భరుకచ్ఛముననే యుండెను. అక్కడ నొక చైత్యనిర్మాణము తల పెట్టి ధర్మనంది ఆరు నెలలలో ముగించెను. అచ్చటనే యొక సంఘమును స్థాపించి మహా చైత్యవాద పక్షమునకు జెందిన సంఘారామము నిర్మించెను.

నవశిశువునకు శక్తిమతియే పెంచునది. నాగబంధునిక మరల సమదర్శికి మంత్రియు అంగరక్షక సేనాపతియు నైనది.

***

వివాహమైన కొలదిదినములకు చక్రవర్తి సువర్ణశ్రీమహారాజునకు, హిమబిందునకు పాటలీపుత్రమున ఉత్తరాంధ్ర సామ్రాజ్యమునకు రాజ ప్రతినిధి పట్టము గట్టినారు.

జ్యోతిష్యులు వీరిరువురికుమారుడు చారుగుప్తమహారాజ నామ ధేయుడై ఒక మహా సామ్రాజ్యమునకు పాటలీపుత్రపురమున మూలపురుషు డగునని సెలవిచ్చి యుండిరి. ఆ విషయము స్థౌలతిష్యులవారీ వరకే భవిష్యత్తును తెలిపియుండిరి.

ధాన్యకటకమునకు చక్రవర్తియు, శ్రీకృష్ణసాతవాహన మహారాజు, ధర్మనందియు, శక్తిమతీదేవియు, మహామంత్రులు, సైన్యాధ్యక్షులు, సేనాపతులు మొదలగు వారందరు తరలిపోయిరి.

ఆరునెలలు శ్రీకృష్ణమహారాజునకు చంద్రదేవికిని (విషకన్య) ఎట్లు గడచినవో! స్థౌలతిష్యుల ఆశ్రమమునందు విషకన్యక అమృతకన్యక యగుచుండెను. శ్రీకృష్ణ మహారాజునకు మహర్షి దివ్య ఓషధుల సేవింప జేయుచుండెను.

శ్రీకృష్ణసాతవాహనప్రభువు తన భవిష్యద్దేవిని దర్శింపని దిన మొక్కటియు లేదు. విషకన్యక అపరాజితాదేవి వలె ప్రకాశించిపోవు చుండెను. అమృతపాదార్హతులు తండ్రిని అప్పుడప్పుడు దర్శించుచు వివిధవాదముల విశ్వతత్వము నిర్ణయించుకొనుచుండెను. తండ్రి తాతగారల వాదనలలో విషకన్యక బ్రహ్మానందసుఖ మనుభవించుచు తనప్రియుని మూర్తియే

అడివి బాపిరాజు రచనలు - 2

• 294 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)