పుట:Himabindu by Adivi Bapiraju.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



దమ్మం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి,
దుతియంపి బుద్ధం శరణం గచ్ఛామి,
దుతియంపి దమ్మం శరణం గచ్ఛామి,
దుతియంపి సంఘం శరణం గచ్ఛామి,
తతియంపి బుద్ధం శరణం గచ్ఛామి,
తతియంపి దమ్మం శరణం గచ్ఛామి,
తతియంపి సంఘం శరణం గచ్ఛామి,
పానాతిపాతా వరమనీ సిఖ్ఖాపదం సమాదియామి.
అదిన్నాదానా వరమనీ సిఖాపదం సమాదియామి.
కామేసు మిచ్ఛాచారా వరమనీ సిఖ్ఖాపదం సమాదియామి.
ముసాపాదా పరమనీ సిఖ్ఖాపదం సమాదియామి.
సురా-మెరయా మజ్జ-పమాద-దానా వరమనీ.
సిఖ్ఖాపదం సమాదియామీ”

అని పాడిరి.

బౌద్ధధర్మాభిషేక విధానమును, ఆర్యధర్మాభిషేక విధానమును ఒకటియే.

రెండు ధర్మముల ప్రకారము అభిషేకము జరిగెను. చారుగుప్తుని భుజముపై కుడిచేయి నిడి చక్రవర్తియు, అతని ఎడమ పార్శ్వమున చక్రవర్తినియు, చెలికత్తె శక్తిమతి చేయిబట్టియు సింహాసనము చెంతకు వచ్చిరి. సర్వవాద్యములు మ్రోగుచున్నవి. నృత్యగీతాది కళాప్రదర్శనములు జరుగు చున్నవి.

ఐతరేయబ్రాహ్మణము ననుసరించి స్థౌలతిష్యమహర్షి సార్వభౌమ పట్టాభిషేక మొనర్చి, సార్వభౌమకిరీటములు వారితలలపై నుంచేను. మహ దాశీర్వచనము, సుమంగళుల హారతియు జరిగినవి.

దమ్మసూత్తముల ననుసరించి బౌద్ధార్హతశిరోమణియైన అమృత పాదులు చక్రవర్తికి అభిషేకము చేసెను.

చక్రవర్తి చారుగుప్తుని సకలజంబూద్వీపసామ్రాజ్యమునకు మహామంత్రిగ అభిషేకము చేసి ముద్రిక లందిచ్చెను. 

23. శుభమంగళ గీతములు

అభిషేకమహోత్సవములు సకలభారతావనియుందును కొన్నినెలలు జరిగినవి. కుసుమపురము కన్నుల వైకుంఠమై, ఆనందకోలాహలమై పోయినది.

అభిషేక మహోత్సవమైన కొలదిదినములకు శుభముహూర్తముల సువర్ణశ్రీ హిమబిందుల వివాహమును, నాగబంధునికా సమదర్శుల వివాహమును జరిగినవి.

సమదర్శిసాతవాహనుడు ఆంధ్రశత్రువులకు సమవర్తి కావున, సమవర్తి బిరుదనామ ప్రసిద్ధుడు. ఆతడు రాజముద్రిక లంది, భార్యాద్వితీయుడై, చంద్రస్వామి మహా పండితయుక్తుడై, తన సైన్యము గూడుకొని భరుకచ్చ పట్టణమునకు బోయినాడు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 293 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)