పుట:Himabindu by Adivi Bapiraju.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నీ పోలిక నీ విగ్రహ మేల చెక్కితివి?” అని గాంధార నివాసి యగు నొక బౌద్ధభిక్షుకు డడిగినాడు.”

“నేను పొందలేని అర్హతత్వము నీవిధమున పొందింప చేసికొంటిని.”

“ఓయి వెఱ్ఱివాడా! నీవుమాత్ర మేల బోధిసత్వుడవు కాలేవు?”

“కొన్ని జన్మలవరకు కాలే నని నాకు నిశ్చయముగ తెలుసును. నా మనస్సు అద్భుత మగు నొక విషయమున తగులము నందినది. ఆ వస్తువే నాకు స్వప్నము. ఆ వస్తువును మనసా నేను విడిచి ఉండలేను.”

“ఏల నీ వా వస్తువును పొందకూడదు?”

“అది నేను పొందదగినది కాదు. నేను వేవిధముల పూజింపదగిన మహాపురుషుని దది.”

ఆ భిక్షుకుడు ఈ బాలశిల్పి ఒక పరకీయను, బహుశః గురుపత్నిని, ఆశించెనేమో యని ఎంచినాడు.

“కుమారా! నీవు దీక్ష గైకొనుము. దీక్షయే ఈ ప్రపంచవాసనల నుండి నీకు విముక్తి కలుగజేయును” అని బోధించెను.

సువర్ణశ్రీ ఆలోచనాతీక్షణ మగు వదనమున “నేను దీక్ష పుచ్చుకొందును. రేపటి దినముననే పుచ్చుకొందును. బుద్ధుని చరణము తప్ప నాకు వేరు గతి లేదు. అని చెప్పెను.

“అయిన నీ దీక్షకు వలయు సన్నాహము చేయించెద” నని భిక్షుకు డా శిల్పభవనము నుండి వెడలెను.

సువర్ణశ్రీ అర్ధనిమీలితనేత్రుడై బుద్ధదేవుని ధ్యానించుచుండ మనో నయనమున హిమబిందు ప్రత్యక్షమయ్యెను. హృదయము చెదరి సువర్ణశ్రీ కన్నులు తెరచెను. ఎదుట చిరునవ్వు నవ్వుచు హిమబిందు నిలిచియున్నది. హిమబిందుమూర్తి ప్రత్యక్షమగుటయు, సువర్ణశ్రీ కళ్ళు మరియూ గట్టిగా మూసుకొనినాడు. ఆమె ఇంకను కనులలోనే నిలచియున్నది.

బుద్ధదేవునకు కామదేవు డటులనే ప్రత్యక్షమైనాడు. ఆమె అటుల తన చూపులలో, సర్వస్వములో ప్రత్యక్షమగుట అతనికి సంతోషమే కూర్చినది. అటుల నానంద ముద్భవించుట గమనించి యాతడు కించ పడినాడు.

తాను భిక్షుకుడయ్యు ఈ దేవిని మరచిపోలేడా? ఈ అద్భుత సుందరీమణినీ, సకలకళాధిదేవిని తాను మరువలేడా? తన హృదయము చిత్తము నిజముగా భిక్షుత్వ మందలేదా?

“దేవీ! హిమబిందూ! నాకళాతపస్సు మూర్తీభవించిన అపర తారాదేవీ! ఆనందమయీ! సౌందర్యమయీ! నిన్ను విడిచి ఎట్లు నేను భౌద్ధ బిక్షుకుడను కాగలను! కట్టిన పుట్టములు, కాషాయవర్ణములు, భావములు కాంక్షాపూర్ణములు” అని ఆతడు పెదవులు కదలించెను.

“అవునయ్యా! నీవు బౌద్ధభిక్షుకుడ వెట్టు కాగలవు” అని తీయని మాటలు వినబడినవి.

ఆత డా మాటలు తన హృదయమునుండి వినబడిన వనుకొనెను.

“నా బుద్ధసేవకు నీ వడ్డము రావలదు. దేవీ! నిన్ను ప్రేమించితిని, ప్రేమించు చున్నాను. నిన్ను మరచిపోవు శక్తి నాకు నీవే ప్రపాదింప వలయును.”

అడివి బాపిరాజు రచనలు - 2

• 286 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)