పుట:Himabindu by Adivi Bapiraju.pdf/289

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెండు చిత్తసంస్కారములు అమృతపాదులను కలతపెట్టినవి. ఆరోగ్యము కుదిరి ఇటునటు నడయాడుచున్న దినములలో స్థౌలతిష్యులు తన కుమారుని జాగరూకతతో గమనింపుచుండెను. చక్రవర్తి వచ్చెను. చారుగుప్తుడు, శ్రీకృష్ణసాతవాహనుడు, అచీర్ణుడు, స్వైత్రుడు, ధర్మనంది, మహారాణి ఆనందాదేవి, శక్తిమతీదేవి, నాగబంధునిక, అమృతలతాదేవి, ముక్తావళీదేవి, సమవర్తి, కీర్తిగుప్తుడు, అనేకులు ఆంధ్రపల్లవాధరలు, పురుషసింహములు అమృతపాదులను దర్శింప వచ్చుచుండిరి. అనేకు లీ విచిత్రము చూడవచ్చుచుండిరి.

“ఏమి విడ్డూరము! ఈ అద్భుత సంఘటన ఎట్లు జరిగినది? తన కుమారుని ఈ మహర్షి ఎట్లు రక్షించుకొనినాడు?” అని స్థౌలశిష్యునకు, అమృతపాదులకు నమస్కరించుచు వేలకొలది జనులు, బౌద్ధులు, భిక్షుకులు, బ్రాహ్మణులు, సన్యాసులు దర్శనము చేసికొని వెళ్ళుచుండిరి.

స్థౌలతిష్యుడుగూడ నీ యద్భుతఘటనచే ఆలోచనలో పడెను. తన పుత్రు డేల బౌద్ధుడైనాడు? ఆతనికి పూర్వస్మృతి పోవుటయేమి? ఆతడు మరల ఆరునెలలో సర్వశాస్త్రములు నేర్చుకొనుట యేమి? బౌద్ధ సన్యాసి యగుట ఏమి? అర్హతుడై, కులపతియై తన చరితమువలన, మహోత్తమబోధవలన ఆంధ్రదేశమున బౌద్ధధర్మము విరివిగ వ్యాపింప జేయు టేమి? సహజప్రతిభచే, సహజ సత్యశాంతి శీలముచే, పరమకరుణా పూరిత హృదయముచే ప్రజల కోటానుకోట్లుగ నాకర్షించినాడు. బుద్ధుడే మరల నవతరించినాడని ప్రజ లనుకొందురట. తనకర్తవ్యమేమి?

తనపుత్రుడు ఆర్యధర్మము వీడనట్లా, వీడినట్లా? పూర్వస్మృతి లేనప్పుడు, సంపూర్ణజ్ఞానము లేనట్లు కాదా? అట్టివాడు బాలకుడే యగును. బాలకుడు స్వధర్మ మెట్లు వదులుకొనును? పరధర్మ మెట్లు గైకొనుట యగును?

అమృతపాదులకు లంబికాయోగము వదలి పూర్తిగ మెలకువ వచ్చినంతట ఏదియో అనుభూతి, ఏదియో మహాస్మృతి కలిగినది. తాను నందిదత్తుడు. తండ్రికడ వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, దర్శనములు, సూత్రములు, ధర్మశాస్త్రములు, జ్యోతిషాది షట్ఛాస్త్రములు-వీనియన్నిటిలో మహాపండితు డైనాడు. తమ నివాస మగు కాశిలో ఒకనాడు తాను, తనభార్య, తనచిన్నబిడ్డ, తనతండ్రి, తనతల్లి వ్యాసకాశి పోవుచుండిరి. గంగానది వేగముగా ప్రవహించుచుండెను. గాలి వీచినది. అనేకములగు పడవలును దాటుచుండెను. ఇంతలో తమ పడవయు, వేరొక పడవయు తారసిల్లి గట్టిగ కొట్టుకొన్నవి. తమపడవ మునిగిపోయినది.

ఆ వెనుక తన కేమియు స్మృతిలేకపోయినది. తనతండ్రి తన్ను కొట్టి, శస్త్రవైద్యముచేసి, తనకు పూర్వస్మృతి తెచ్చినాడు.

ఎంతవిచిత్రము! నీటి లోబడిన తన్ను పాటలీపుత్రపురమున కెగువను, ఆనందాశ్రమతీరమున గంగలో నుండి భిక్షుకులు పైకితీసినారు. తాను విద్యలు నేర్చుకొనెను. పలుచని తెరవలెనుండిన స్మృతివెనుకనుండి చదువులుమాత్రము వచ్చినవి. అచ్చటనుండి తాను బౌద్ధ సన్యాసి యాయెను. అర్హతు డాయెను. తనభార్య ఉత్తమాంగన, మహాసాధ్వి కనబడ దేమి? తమ యను రాగము ఎంత ఉచ్ఛస్థితిని నడచినది? తనబిడ్డ చంద్రబాల వెన్నముద్దల తల్లియై, బంగారుబాలయై మాటల

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 279 •